అక్రమ పట్టాలకు చెక్… 48 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం….
ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై కఠిన చర్యలు తప్పవు…
–జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:ధర్మారం,
ధర్మారం మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులోని ప్రభుత్వ భూములపై జరిగిన అక్రమ ఆక్రమణలు, చట్టవిరుద్ధ రికార్డు నమోదులపై విచారణ చేపట్టి సుమారు 48 ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, ధర్మారం మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులోని సర్వే నెం. 273లో మొత్తం 130 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో సుమారు 59 ఎకరాలు కాస్తులో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇందులో 23 మంది రైతులు అసైన్మెంట్ కమిటీ ఆమోదం లేకుండానే సుమారు 48 ఎకరాల భూమిని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించుకుని సాగు చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.
ఈ నేపథ్యంలో ల్యాండ్ ఎన్‌క్రోచ్‌మెంట్ యాక్ట్–1905 ప్రకారం సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి విచారణ నిర్వహించిన అనంతరం, వారు పొందిన పట్టాదారు హక్కులు చెల్లవని నిర్ధారించినట్లు వెల్లడించారు.
తదనంతరం ధర్మారం తహశీల్దార్ ఆధ్వర్యంలో సుమారు 48 ఎకరాల ప్రభుత్వ భూమిని గట్లు చదును చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమణ చట్టరీత్యా శిక్షార్హమని హెచ్చరిస్తూ హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించి ఉన్నా లేదా చట్టవిరుద్ధంగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించుకుని ఉన్నా, స్వచ్ఛందంగా సంబంధిత తహశీల్దార్ల ద్వారా ప్రభుత్వానికి అప్పగించాలని కలెక్టర్ సూచించారు.
లేనిపక్షంలో గుర్తించిన వెంటనే అక్రమ పట్టాలను రద్దు చేసి భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన, క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
