రోడ్లపై ఆక్రమణలకు చెక్ – సూర్యాపేటలో ‘ఆపరేషన్ రోప్’ స్పెషల్ డ్రైవ్
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించి ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు “ఆపరేషన్ రోప్ (Removal of Obstructive Parking and Encroachments)” పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కూరగాయల మార్కెట్ రోడ్డుపై ఉన్న ఆక్రమణలను మున్సిపల్ అధికారులతో కలిసి తొలగించారు. రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని హెచ్చరించి, వెంటనే ఖాళీ చేయించారు. అలాగే రోడ్డుపై పేరుకుపోయిన మట్టి కుప్పలు, చెత్త, రాళ్లను తొలగించి వాహనాల రాకపోకలకు అనుకూలంగా మార్చారు. పట్టణాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణం జరిగేలా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అనధికార పార్కింగ్, రోడ్డు ఆక్రమణలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఈ డ్రైవ్ కొనసాగుతుందని చెప్పారు. రోడ్డు భద్రతలో భాగంగా అమలు చేస్తున్న “అరైవ్ అలైవ్” కార్యక్రమానికి అనుసంధానంగా ఈ ఆపరేషన్ రోప్ చేపట్టబడిందని అధికారులు వెల్లడించారు. రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేయవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వ్యాపారులకు, వాహనదారులకు పోలీసులు సూచించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
