ఎంజేపీ గురుకులాలకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలి…
8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్ – 100 శాతం ఫలితాలే లక్ష్యం…
– మంత్రి పొన్నం ప్రభాకర్….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: హైదరాబాద్,
మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల విద్యాసంస్థలను రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఎంజేపీ గురుకులాల పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు
ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రిన్సిపాళ్లను అభినందించిన మంత్రి, తక్కువ ఫలితాలు సాధించిన విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు ఆత్మపరిశీలన చేసుకొని వచ్చే విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాలు సాధించాలని హెచ్చరించారు.
విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక అంశాలపై కూడా అవగాహన కల్పించాలని సూచించారు. గురుకులాల్లో విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని, ఉపాధ్యాయులు తమ సొంత పిల్లల్లా విద్యార్థులను చూసుకోవాలని కోరారు.
ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన భోజనం, వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ భవనాల్లో నిర్వహిస్తున్న పాఠశాలల్లో కూడా టాయిలెట్లు, ఫ్యాన్లు తదితర మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు.
విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, పెద్దల పట్ల గౌరవం పెంపొందించే బాధ్యత ఉపాధ్యాయులదేనని పేర్కొన్నారు. చిన్న చిన్న కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో వారికి మానసిక ధైర్యం, ప్రేరణ కల్పించేలా కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.
అధ్యాపకులంతా కలిసి “ఎంజేపీ గురుకులాలకు ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్” తీసుకురావాలని, ఇతర రాష్ట్రాలు కూడా అధ్యయనం చేసే స్థాయికి విద్యా విధానాన్ని తీసుకెళ్లాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రతి పాఠశాలలో ర్యాంకర్ల ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, గ్రామస్థాయిలో గురుకులాల విజయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
పదో తరగతిలో 98.45 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 204 గురుకులాలు 100 శాతం ఫలితాలు సాధించాయి. 500కు పైగా మార్కులు 9,788 మంది విద్యార్థులు సాధించారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 90.31 శాతం, వొకేషనల్ ద్వితీయ సంవత్సరంలో 97.72 శాతం, ప్రథమ సంవత్సరంలో 85.80 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 900కు పైగా మార్కులు 4,183 మంది, 980కు పైగా మార్కులు 496 మంది విద్యార్థులు సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 35 విద్యాసంస్థలు, ప్రథమ సంవత్సరంలో 8 విద్యాసంస్థలు 100 శాతం ఫలితాలు సాధించాయి.
8వ తరగతి నుంచే విద్యార్థులకు నీట్, ఎంసెట్, ఇతర పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించాలని, ప్రతి గురుకులంలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. తల్లిదండ్రుల సమావేశాలను తప్పనిసరి చేసి, విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని సూచించారు.
ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమయాదేవి, ఎంజేపీ గురుకులాల కార్యదర్శి సైదులు, ఆర్‌సీవోలు, ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.

