బీసీ రిజర్వేషన్లకు బిజెపి బి ఆర్ ఎస్ మోకాలడ్డు: సిపిఐ

Sakshitha news

బీసీ రిజర్వేషన్లకు బిజెపి బి ఆర్ ఎస్ మోకాలడ్డు: సిపిఐ

సాక్షిత వనపర్తి :

42 శాతం బీసీ రిజర్వేషన్లకు బిజెపి బీఆర్ఎస్ మోకాలు అడ్డుపెడుతున్నాయని సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ విమర్శించారు. రాష్ట్ర బీసీ హక్కుల సాధన సమితి, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో వనపర్తి అంబేద్కర్ చౌక్ లో మద్దతుగా సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు బిసిద్రోహులు అన్నారు. గతంలో 37% ఉన్న బీసీ రిజర్వేషన్లను టిఆర్ఎస్ ప్రభుత్వం లో 23 శాతానికి తగ్గించారన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 23% రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు జరిపారు అన్నారు.తెలంగాణ ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలు తీసి దాని ప్రకారం 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తే అమలు కాకుండా అడ్డుపడటం దుర్మార్గమన్నారు. టిఆర్ఎస్ అనుచరులు కోర్టులో కేసులు వేసి రిజర్వేషన్లు అడ్డుకున్నారన్నారు. 42 శాతం రిజర్వేషన్ అమలు కాకుండా బిజెపి ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లును గవర్నర్, రాష్ట్రపతి ఆమోదముద్ర వేయకుండా అడ్డుపడిందన్నారు. బిల్లును ఆమోదించి రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చి ఉంటే 42 శాతం రిజర్వేషన్ కు చట్టబద్ధత లభించేది అన్నారు. తమిళనాడులో ఇదే పద్ధతిలో బీసీ రిజర్వేషన్ అమలు చేశారన్నారు. నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే అసెంబ్లీ చేసిన బిల్లుకు గవర్నర్, రాష్ట్రపతి తో ఆమోదముద్ర వేయించి చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు. 56% బీసీలను పక్కనపెట్టి 10 శాతం కూడా లేని ఓసీలకు 50 శాతం సీట్లు కావాలని కొట్లాడటం దుర్మార్గమన్నారు. బీసీల నోటికాడి ముద్దను లాక్కున్న బిజెపి, టిఆర్ఎస్ పార్టీలకు బీసీలు బుద్ధి చెప్పాలన్నారు. టిఆర్ఎస్ గులాబీ జెండా బిజెపి కాషాయ జెండా మోస్తున్న ఆ పార్టీలోని బీసీలు ఆలోచించాలన్నారు. బిజెపి బీఆర్ఎస్ ఇదే పద్ధతిన అడ్డుపడితే బీసీలు అంత ఏకమై ఆ పార్టీలను బొంద పెడతారన్నారు. 42 శాతం రిజర్వేషన్ సాధన కొరకు పార్టీలకతీతంగా బీసీలు ఐక్యమై పోరాడాలన్నారు. సిపిఐ నేతలు కళావతమ్మ గోపాలకృష్ణ చిన్న కుర్మయ్య పృధ్వినాదం ఎర్రకుర్మయ్య జయమ్మ శిరీష జ్యోతి శ్రీదేవి వెంకటమ్మ రూప సుప్రియ రాంబాబు తదితరులు పాల్గొన్నారు