వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా ఉండాలి….
– రామగుండం మేయర్ మహంకాళి స్వామి…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:రామగుండం, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ప్రమాదాలు జరగకుండా టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా పనిచేయాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి సూచించారు.
మేయర్ తన ఛాంబర్‌లో టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులతో వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరిఖని ఏడీఈగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గుండు శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలిపారు.
సమావేశంలో విద్యుత్ శాఖ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను మేయర్ ప్రస్తావించారు. రోడ్ల విస్తరణకు అడ్డుగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలను వెంటనే తరలించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుంచి న్యూ అశోక థియేటర్ వరకు విద్యుత్ స్తంభాల తరలింపునకు డిమాండ్ నోట్ సమర్పించాలని అధికారులను సూచించారు.
ఇళ్లపై ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేసే పనులకు నగర పాలక సంస్థ చెల్లించిన రూ.17.61 లక్షలకు సంబంధించిన వినియోగ ధ్రువీకరణ పత్రాన్ని అందించాలని కోరారు. శాలపల్లి రోడ్డులో సోలార్ ప్లాంట్ సమీపంలో చెట్ల కొమ్మల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోందని అధికారులు తెలియజేయగా, మేయర్ వెంటనే స్పందించి ఎన్‌టీపీసీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే 24 గంటలపాటు సిబ్బంది అందుబాటులో ఉండి వెంటనే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కార్పొరేటర్లతో సమన్వయం చేసుకుంటూ ప్రతి డివిజన్‌లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.
ఈ సమావేశంలో ఎన్పీడీసీఎల్ అధికారులు వంశీ, జమీల్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
సమీక్షా సమావేశం అనంతరం మేయర్ మహంకాళి స్వామి నగరంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. నాలుగో డివిజన్ ఉదయ్‌నగర్, పవర్‌హౌస్ కాలనీల్లో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనుల ప్రాంతాలను సందర్శించారు. గోదావరిఖని బస్టాండ్‌లో జరుగుతున్న పరిశుభ్రత పనులను తనిఖీ చేశారు.
అలాగే సప్తగిరి కాలనీలోని జ్యోతిబా బీసీ సంక్షేమ పాఠశాలలో ఉన్న సమస్యలను పరిశీలించి, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పెద్ద కాలువతో పాటు పట్టణంలో కొనసాగుతున్న రోడ్ల నిర్మాణం, విద్యుత్ స్తంభాల తరలింపు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ ఏఈ మీర్, టీపీఎస్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
