స్విమ్స్ లో ఫంగల్ డీసీస్ పై అవగాహన
** ముగిసిన వారోత్సవాల సదస్సు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లోని శ్రీ పద్మావతి హాస్పిటల్ లో మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ బి.వి.రమణ, ఇ.యన్.టి – డెర్మటాలజీ విభాగాల ఆధ్వర్యంలో ఫంగల్ డీసీస్ అవగాహన వారోత్సవాలు జరిగాయి. ఈ వారోత్సవ ముగింపు సదస్సుకు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి. కుమార్, మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ జయప్రద, డెర్మటాలజీ విభాగాధిపతి డా. సురేఖ, మైక్రోబయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా. హారిక, డా. రామక్రిష్ణతో పాటు , ఇ.యన్.టి అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. మౌర్య హాజరయ్యారు. ఈ సందర్బంగా స్విమ్స్ సంచాలకులు ఆర్.వి. కుమార్ మాట్లాడుతూ…. మైక్రోబయాలజీ, ఇ.యన్.టి, డెర్మటాలజీ విభాగాల ఆధ్వర్యంలో ఫంగల్ డీసీస్ అవగాహన వారోత్సవాలను స్విమ్స్ లో 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహించడం జరుగిందని తెలిపారు. ఫంగస్ వ్యాధి ముఖ్యంగా చర్మం లేదా గోర్లను ప్రభావితం చేసేవిగా ఉంటాయని, రక్తప్రసరణ సరిగా లేక డయాబెటిస్ ఉంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. అందుకు వీలైనంత త్వరగా డాక్టర్ ను సంప్రదించి వ్యాధిని నయం చేసుకోవాలని తెలిపారు.
మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదా మైకోసిస్ అనేవి ఫంగస్ వల్ల కలిగే వ్యాధులని, ఫంగస్ ఇన్ఫెక్షన్ లు చర్మం లేదా గోళ్లపై సర్వసాధరణంగా ఉంటాయని పేర్కొన్నారు. నిర్లక్ష్యం చేస్తే నోరు, గొంతు, ఊపిరితిత్తులు, మూత్రనాళంతో పాటు శరీరంలోని అనేక ఇతర భాగాలలో కూడా ఇన్ఫక్షన్ కు కారణమవుతాయని తెలిపారు. స్విమ్స్ లో ఫంగస్ ఇన్ఫెక్షన్లకు సంబంధించి ఎన్.టి. ఆర్. ఆరోగ్య వైద్య సేవ, ప్రాణదానం ద్వారా కూడా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. డెర్మటాలజీ విభాగాధిపతి డా. సురేఖ మాట్లాడుతూ… ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఏదైనా వ్యాధి లేదా పరిస్థితిని ఫంగస్ సాధారణంగా చర్మం, జుట్టు, గోళ్లు లేదా శ్లేష్మ పొరలను ప్రభావితం చేస్తాయని వివరించారు. ఎవరికయినా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుందని, అందువలన వీలైనంత త్వరగా డాక్టర్లను సంప్రదించాలని కోరారు.
ఫంగల్ డీసీస్ అవగాహన వారోత్సవాలను పురస్కరించుకొని పేషెంట్ల కోసం ఫంగస్ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది. దీని వలన జరిగే నష్టాలను పవర్ పాయింట్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో మైక్రోబయాలజీ, ఇ.యన్.టి, డెర్మటాలజీ విభాగాల వైద్యులు, విద్యార్ధులు, పేషెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
