పెన్షన్ సమాజ నిర్మాణానికి అటల్ పెన్షన్ యోజన
- అర్హులైన ప్రతిఒక్కరూ పథకంలో చేరాలి
- ఎస్ఎల్‌బీసీ కన్వీనర్ సీవీఎన్ భాస్కరరావు
దేశ పౌరులకు వృద్ధాప్యంలో భద్రతను కల్పించేందుకు, పెన్షన్ సమాజాన్ని నిర్మించేందుకు అమలుచేస్తున్న అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్‌బీసీ) కన్వీనర్ సీవీఎన్ భాస్కరరావు అన్నారు.
విజయవాడ రూరల్ నున్నలోని స్వప్న ఫంక్షన్ హాల్‌లో ఎస్ఎల్‌బీసీ, పీఎఫ్ఆర్‌డీఏ ఆధ్వర్యంలో అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీవీఎన్ భాస్కరరావు మాట్లాడుతూ ఈ పథకంలో 18 – 40 ఏళ్ల వయసున్నవారు చేరవచ్చని.. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంటుందన్నారు. తక్కువ ప్రీమియం చెల్లింపుతో పథకం ప్రయోజనాలు పొందవచ్చని.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 8.26 కోట్లమంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 లక్షల మంది పథకంలో నమోదయ్యారన్నారు. అర్హులైన వారిని పథకంలో చేరేలా ప్రోత్సహించడంలో బ్యాంక్ మిత్రల పాత్ర కీలకమని పేర్కొన్నారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని బ్యాంకుల ప్రదర్శన ప్రశంసనీయమని.. గతేడాది రాష్ట్రంలో సుమారు 5.66 లక్షల మంది పథకంలో చేరారన్నారు. బ్యాంకులు ఇదే ఉత్సాహంతో కృషిచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా పథకానికి సంబంధించి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన బ్రాంచ్ మేనేజర్లు, ఎల్‌డీఎంలు, బ్యాంక్ మిత్రాలను సత్కరించారు.
కార్యక్రమంలో ఎస్ఎల్‌బీసీ కోఆర్డినేటర్ డి.శ్రీనివాస్, ఆర్‌బీఐ జీఎం ఆర్‌కే మహానా, నాబార్డు డీజీఎం ఎంఎం బెహ్రా, ఎల్‌డీఎం కె.ప్రియాంకతో పాటు డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, మెప్మా పీడీ మురళీకృష్ణ ప్రసాద్, ఆర్‌బీఐ, పీఎఫ్ఆర్‌డీఏ, నాబార్డు అధికారులు, బ్రాంచ్ మేనేజర్లు, బ్యాంక్ మిత్రాలు తదితరులు హాజరయ్యారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY