దివ్యాంగుల జీవితాల్లో కొత్త వెలుగు నింపుతున్న సహాయ ఉపకరణాలు….
పెద్దపల్లిలో 75 మంది దివ్యాంగులకు 94 ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ
–కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:పెద్దపల్లి,
దివ్యాంగుల సాధికారతకు సహాయ ఉపకరణాలు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో అలిమకో సంస్థ ఆధ్వర్యంలో, సమగ్ర శిక్ష మరియు జిల్లా విద్యాశాఖ కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని లబ్ధిదారులకు ఉపకరణాలు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. విద్య, ఉపాధి, స్వావలంబన రంగాల్లో దివ్యాంగులకు మరింత ప్రోత్సాహం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సహాయ ఉపకరణాలు వారి దైనందిన జీవితాన్ని సులభతరం చేయడంతో పాటు స్వతంత్రంగా జీవించేందుకు దోహదపడతాయని తెలిపారు.
ఈ శిబిరంలో మొత్తం 75 మంది దివ్యాంగులకు 94 సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. అందులో ట్రైసైకిళ్లు, సీపీ చెయిర్లు, టీఎల్‌ఎం కిట్లు, విజువల్లి ఇంపెయర్డ్ కిట్ (సుగమ్య కేన్), వీల్ చెయిర్లు, హియరింగ్ ఎయిడ్స్, రోలేటర్ వంటి ఉపకరణాలు ఉన్నాయి.
దివ్యాంగులకు అవసరమైన సదుపాయాలు అందించి వారి జీవితాల్లో మరింత స్వావలంబన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి శారద, సీఎంఓ కవిత, కోఆర్డినేటర్ మల్లేష్ గౌడ్, హెచ్‌ఎం అరుణతో పాటు అన్ని మండలాల ఐఈఆర్‌పీలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
