సీజేఐ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
- ప్రతిష్టాత్మక మీడియేషన్ సింపోజియంకు వేదికగా విజయవాడ
- కార్యక్రమం విజయవంతానికి సమష్టిగా కృషిచేద్దాం
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ రాష్ట్ర పర్యటనలో భాగంగా మార్చి 1వ తేదీన విజయవాడలో పర్యటించనున్న నేపథ్యంలో కార్యక్రమం విజయవంతానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని.. సమష్టి కృషితో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
సీజేఐ పర్యటన నేపథ్యంలో గురువారం న్యాయశాఖతో పాటు ప్రోటోకాల్, పోలీస్, రెవెన్యూ తదితర సమన్వయ శాఖల అధికారులతో వర్చువల్ గా జరిగిన సన్నద్ధత సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కలెక్టరేట్ నుంచి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దక్షిణ భారత్లోనే తొలిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మీడియేషన్ (మధ్యవర్తిత్వం)పై జరగనున్న సింపోజియంకు విజయవాడ వేదిక కానుందని.. ఈ కార్యక్రమంలో గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ పాల్గొంటారని తెలిపారు.
ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తులతో పాటు అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని వివరించారు. పర్యటన నేపథ్యంలో అతిథులకు అవసరమైన వసతితో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పటిష్ట భద్రతపైనా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం జరగనున్న ఆంత్రా లక్జ్ కన్వెన్షన్ సెంటర్ వద్ద పటిష్ట ఏర్పాట్లు చేయడంలో అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కార్యక్రమంలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయడంలో సమన్వయ శాఖల అధికారులు భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు.
(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్, ఎన్టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
