సుల్తానాబాద్‌లో ఆగస్టు 20న మహాసభలు – కార్మిక వర్గం తరలిరావాలని ఏఐటీయూసీ పిలుపు….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : సుల్తానాబాద్‌లో ఆగస్టు 20న నిర్వహించనున్న ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా 4వ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్, వర్కింగ్ ప్రెసిడెంట్ పూసల రమేష్ కార్మికులకు పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
సుల్తానాబాద్‌లోని నరహరి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే మహాసభలకు సీపీఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కాలవేణ శంకర్, ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజు, ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎం. ప్రవీణ్ కుమార్, సీపీఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అనుకూలంగా ఉన్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా కుదించడం వల్ల కార్మికులపై పని భారం, ఉద్యోగ అభద్రత, పని గంటల పెంపు వంటి సమస్యలు పెరుగుతున్నాయని వారు ఆరోపించారు. కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు, సంక్షేమ సౌకర్యాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అసంఘటిత, సంఘటిత రంగాల్లోని కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఏఐటీయూసీ ఆవిర్భవించి 106 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ మహాసభలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత, ఉపాధి హామీ, సంక్షేమ సౌకర్యాల సాధన కోసం భవిష్యత్ కార్యాచరణపై మహాసభల్లో చర్చిస్తామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కార్మికులు, ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో ఏఐటీయూసీ రామగుండం నగర అధ్యక్షుడు అబ్దుల్ కరీం, ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్, జిల్లా నాయకులు నాంసాని శంకర్, రెడ్డపాక లక్ష్మణ్, సత్యనారాయణ, రాజేందర్ రెడ్డి, షేక్ మసూద్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
