పనిచేసే చోట మహిళలపై వేధింపులు జరిగితే పోష్ యాక్టు 2013 ప్రకారం చర్యలు

Sakshitha news

పనిచేసే చోట మహిళలపై వేధింపులు జరిగితే పోష్ యాక్టు 2013 ప్రకారం చర్యలు
పోష్ యాక్టు పై మహిళలతో పాటు పురుషులకు అవగాహన కల్పించాలి – జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వి. రజని

….

  సాక్షిత వనపర్తి:
పని చేసే చోట మహిళలకు వేధింపులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని,  మహిళలకు ఎక్కడైనా వేధింపులు ఉంటే నిర్భయంగా లోకల్  కంప్లయింట్ కమిటీ లో ఫిర్యాదు చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ రజని సూచించారు.
వనపర్తి జిల్లా  ఐ.డి. ఒ.సి. సమావేశ మందిరంలో గురువారం  జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లోకల్ కంప్లయింట్ కమిటీ సమావేశం నిర్వహించారు. 
పురుషులతో సమానంగా మహిళలు పని చేసుకునే విధంగా   మహిళా రక్షణ చట్టాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు   ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే మహిళలను లైంగిక  వేధింపులకు గురి చేస్తే ఫిర్యాదు చేసేందుకు ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీలు, ఆ పై జిల్లా స్థాయిలో లోకల్ కంప్లయింట్ కమిటీని  ఏర్పాటు చేసుకోవడం జరిగింది.  
ఈ సందర్భంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ  మాట్లాడుతూ  పని ప్రదేశంలో అది ప్రభుత్వ కార్యాలయాలు అయిన ప్రైవేట్ సంస్థల్లో లేదా ఇళ్లలో అయిన సరే  మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు.  మహిళలపై శారీరిక, మానసిక వేధింపులకు పాల్పడితే బాధ్యులపై చట్ట పరంగా తగిన శిక్షలు ఉంటాయని యాక్టు గురించి మహిళా ఉద్యోగులకు అవగాహన కల్పించారు.  బాధితులు 90 రోజుల్లో  ఇంటర్నల్ కమిటీకి  లేదా షి బాక్స్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో ఫిర్యాదు చేయవచ్చని  సూచించారు. మహిళల రక్షణ చట్టాలు, లైంగిక వేధింపుల  విధానాలు, చట్టం ద్వారా మహిళలకు రక్షణపై అవగాహన కల్పించారు.

సమావేశంలో పాల్గొన్న డీఎస్పీ బాలాజీ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో 64 శాఖల్లో ఇంటర్నల్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, లోకల్ కమిటీ సైతం ఏర్పాటు చేసి ఉన్నందున మహిళలకు పనిచేసే చోట లైంగిక వేధింపులకు గురి అయితే సంకోచించకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధ్యులను విచారించి ఆరోపణ నిర్ధారణ అయితే సెక్షన్ 74 ప్రకారం శిక్షలు ఉంటాయని చెప్పారు. మహిళల కోసం ఉద్దేశించిన చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

  ఈ సమావేశంలో  జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, లోకల్  కమిటీ సభ్యులు డా. శ్రీలేఖ, జి.సి.డి. ఒ సుబ్బలక్ష్మి, శ్రీదేవి, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్  చిన్నమ్మ థామస్, డి.సి.పి. ఒ రాంబాబు,  మహిళా ఉద్యోగులు  తదితరులు పాల్గొన్నారు