పోక్సో కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష…

Sakshitha news

పోక్సో కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష…

రూ.5 వేల జరిమానా విధించిన పెద్దపల్లి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం….

కేసును సమర్థంగా దర్యాప్తు చేసిన పోలీసు అధికారులను అభినందించిన పోలీస్ కమిషనర్…

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రామగుండం, రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ పెద్దపల్లి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 2020 నవంబర్ 5న బాధిత బాలిక తండ్రి తన 14 ఏళ్ల కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో రామగిరి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం.138/2020 కింద సెక్షన్ 363 ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో బాలికను గుర్తించి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయగా, నిందితుడు ఎం.డీ. రహీంపాషా ప్రేమ వివాహం పేరుతో మోసపూరితంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది. దీంతో కేసులో సెక్షన్ 366-ఏ, 376(2)(3) ఐపీసీతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 6ను చేర్చి దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌ను న్యాయస్థానంలో దాఖలు చేశారు.
పెద్దపల్లి పోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ అనంతరం న్యాయమూర్తి శ్రీమతి స్వప్నరాణి సమర్పించిన సాక్ష్యాధారాలు, ఇరుపక్షాల వాదనలు పరిశీలించి నిందితుడు ఎం.డీ. రహీంపాషాపై నేరారోపణలు రుజువయ్యాయని నిర్ధారిస్తూ 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించారు.

ఈ కేసులో నేరం రుజువై నిందితుడికి శిక్ష పడేలా చేయడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్, భరోసా లీగల్ కౌన్సిలర్ ఎం. సాధ్యారాణి కీలక పాత్ర పోషించారు.

పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్‌రెడ్డి, ఏసీపీ మడుత రమేష్ పర్యవేక్షణలో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడంలో సహకరించిన సీఐ బుద్దె స్వామి (మంథని), ఎస్‌ఐ టీ. శ్రీనివాస్ (రామగిరి), కోర్టు కానిస్టేబుల్ ఎస్.కె. షాహాబాజ్, లైజన్ ఆఫీసర్ పి. కోటేశ్వరరావులను రామగుండం పోలీస్ కమిషనర్, డీఐజీ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.

Scroll to Top