రైతుల గోస ఎవరికీ పట్టదా……….!
*
ఆరుగాలం కష్టించి పండించినా….. నెల రోజులకు పైగా కొనుగోలు కేంద్రాలలోనే మక్కుతున్న వరి ధాన్యం
పట్టించుకోని సివిల్ సప్లయ్ అధికారులు… ఇబ్బందుల్లో రైతాంగం
*
జిల్లా కలెక్టర్ కలుగజేసుకుని సమస్యను పరిష్కరించాలి
—- డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్
….
సాక్షిత వనపర్తి:
ఆరుగాలం శ్రమించి పండించిన పంట నెలరోజులకు పైగా కొనుగోలు కేంద్రాలలో మగ్గుతున్నా… రైతులు పడుతున్న గోస ఎవరికి పట్టడం లేదని బిసి పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
వనపర్తి మండలం అంకూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి ధాన్యం రాశులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అధికారులు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు పడుతున్న ఇబ్బందులను కళ్ళు తెరిచి చూడాలన్నారు.
నెల రోజులకు పైగా కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు పడిగాపులు కాస్తూ తీవ్ర సమస్యలతో అక్కడే ఉండాల్సి వస్తుందన్నారు.
ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ…లావు రకం వడ్లను దించుకోకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సివిల్ సప్లయ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇది మళ్ళీ పునరావృతం అయితే రోజుకో ఎపిసోడ్ మాదిరిగా అధికారుల లీలలు బయట పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
రైతుల దీనస్థితి ఏ పార్టీ నాయకుడికి పట్టడం లేదని, రైతులను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారని, రైతులు పండించిన ధాన్యం కల్లాల్లోనే మగ్గుతుంటే అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు కళ్ళు మూసుకున్నారా అంటూ ప్రశ్నించారు.
మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ జిల్లా అధికార యంత్రాంగంతో చేసిన సమీక్ష సమావేశం కేవలం నీటి మీద బుడగ లాగే మారిందన్నారు.
తరుగు పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తుంటే పట్టించుకునే నాధుడే లేకపోవడం దురదృష్టకరమన్నారు.
ఇకనైనా జిల్లా కలెక్టర్ కలుగజేసుకుని రైతులు పడుతున్న గోసను వెంటనే తీర్చాలని, లేదంటే బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి వనపర్తి అద్యక్షులు దేవర శివ నాయకులు వివి గౌడ్, అంజన్న యాదవ్, ధర్మేంద్ర సాగర్, రాఘవేందర్ గౌడ్, అస్కని రమేష్, రామన్ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

