మారకద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోదని యువతను కోరిన జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
సాక్షిత వనపర్తి :
దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పిలుపునిచ్చారు.
నషాముక్త్ భారత్ అభియాన్ (మిషన్ పరివర్తన) కార్యక్రమంలో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ దేశమైన అభివృద్ధి సాధించాలంటే అందులో యువత ప్రధాన భూమిక ఉంటుందని, అలాంటిది ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశం మన భారత దేశమని చెప్పారు. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన యువతలో కొంతమంది తప్పుడు స్నేహం, దురలవాట్ల వల్ల మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను చేతులారా నాశనం చేసుకోవడమే కాకుండా తమ తల్లిదండ్రులకు శోకాన్ని మిగుల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా సరైన మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు.
వనపర్తి జిల్లాలో ఎక్కడైనా డ్రగ్స్ కనిపించిన, లేదా ఎక్కడైనా గంజాయి పండిస్తున్నట్లు తెలిసిన వెంటనే పోలీస్ యంత్రాంగానికి చెప్పి మీ తోటి వాళ్ళ జీవితాలను కాపాడాలని సూచించారు. మాదకద్రవ్యాలతో పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మాదకద్రవ్యాల సేవనం చేయమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ డ్రగ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. సుధారాణి, వనపర్తి CI, ఎస్సై, CDPO లు సూపర్వైజర్లు, ఐసిపిఎస్ సిబ్బంది, మెడికల విద్యార్థులు పాల్గొన్నారు.

