అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఉచిత ఇంటిస్థలం : ప్రత్తిపాటి
స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మాజీమంత్రి ప్రత్తిపాటి.
పేద, మధ్యతరగతి వర్గాల ఛిరకాల వాంఛ అయిన సొంతింటి కలను నిజం చేయాలన్న ధృఢ సంకల్పంతో కూటమిప్రభుత్వం ఉందని, త్వరలోనే పట్టణాలు, గ్రామాల్లో ఇంటిస్థలం లేనివారిలో అర్హుల్ని గుర్తించి ఉచితంగా స్థలాలు మంజూరు చేయనుందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. తమ సమస్యలు, ఇబ్బందులు తెలియచేస్తూ ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించిన ప్రత్తిపాటి. వాటి పరిష్కారంలో భాగంగా అధికారయంత్రాంగంతో మాట్లాడి, ప్రజలకు త్వరగా న్యాయం చేయాలని సూచించారు.
పట్టణంలో నివాసముండే ఇళ్లులేని 199 పేద కుటుంబాలకు రేపు (బుధవారం) ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను మంజూరు చేయనున్నట్టు ప్రత్తిపాటి తెలిపారు.
తమకు ఇంటి స్థలాలు కావాలని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తమ కుటుంబీకులకు వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వం నుంచి సీఎంఆర్ఎఫ్ సాయం అందించాలని కోరుతూ పలువురు ప్రత్తిపాటికి అర్జీలు అందించారు. వారి విజ్ఞప్తులు పరిశీలించిన ఎమ్మెల్యే, తప్పక న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. సీఎంఆర్ఎఫ్ అర్జీలను వెంటనే ప్రభుత్వానికి పంపించాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.
అర్జీలు ఇచ్చినవారిని ఉద్దేశించి మాట్లాడిన ప్రత్తిపాటి.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివాసముండే ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబానికి సొంతిల్లు అందించాలన్న ధృఢసంకల్పంతో చంద్రబాబు ప్రభుత్వం ఉందని, ఇంటి నిర్మాణానికి జాగా లేని వారికి త్వరలోనే ఉచితంగా స్థలాలు మంజూరు చేయనుందని ప్రత్తిపాటి చెప్పారు. గ్రామాల్లోని వారికి 3 సెంట్లు, పట్టణాల్లోని వారికి 2 సెంట్ల స్థలం మంజూరు దిశగా ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించిందన్నారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా అమలుచేసిన జగనన్న కాలనీలు, సెంటు పట్టాల పంపిణీలోని అవకతవకల్ని సరిచేసి, అర్హులకు న్యాయం చేస్తుందన్నారు. గతంలో టీడీపీప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాలు పొందిన లబ్ధిదారులు వాటిలో నివాసం ఉండకుండా నిరుపయోగంగా ఉంచడంపై స్పందించిన ప్రత్తిపాటి.. ఇళ్లు పొంది వాటిని సద్వినియోగం చేసుకోని వారి రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు చెప్పారు. లబ్ధిదారులు తమకు అప్పగించిన ఇళ్లలో నివాసం లేకుంటే. వారి రిజిస్ట్రేషన్లు రద్దుచేసి, వాటిని అర్హులైన ఇతరులకు కేటాయించనున్నట్టు ప్రత్తిపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

