డిజిటల్ క్రాప్ సర్వేలో తప్పులకు తావులేదు…
రైతులు సాగు చేసిన పంటల వివరాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నమోదు చేయాలి….
సేంద్రియ, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి….
— కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, పెద్దపల్లి// : డిజిటల్ క్రాప్ సర్వేను ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి పరిధిలో పకడ్బందీగా, పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. రైతులు సాగు చేసిన పంట, సాగు విస్తీర్ణం వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి తప్పులకు, పెండింగ్‌కు అవకాశం లేకుండా నిర్ణీత గడువులో నమోదు చేయాలని సూచించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. డిజిటల్ క్రాప్ సర్వే, యూరియా సరఫరా, సేంద్రియ వ్యవసాయం, పంటల సాగు విస్తీర్ణం, రైతులకు అందుతున్న వ్యవసాయ సేవలు తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించి, ఆసక్తి ఉన్న రైతులను ప్రోత్సహించాలని అన్నారు. పంటల సాగు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ నీటి లభ్యత, నేల స్వభావం, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు.
రైతులకు అందుబాటులో ఉండాలి:-
వ్యవసాయ విస్తరణ అధికారులు తమ పరిధిలోని రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పంటల యాజమాన్య పద్ధతులు, తెగుళ్ల నివారణ తదితర అంశాలపై సాంకేతిక సూచనలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఒకే పంటపై ఆధారపడకుండా రైతులకు లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, రైతులకు అందుతున్న సేవల అమలును మండలాల వారీగా పర్యవేక్షిస్తూ నిర్ణీత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
వ్యవసాయ రంగ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ రూపొందించి, రైతులకు మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST