ఆశ్రమం నుంచి వైద్య కళాశాల వరకు.. సంధ్య విజయ ప్రస్థానం….
తబిత ఆశ్రమంలో చదువుకున్న అనాథ బాలికకు ఎంబీబీఎస్ సీటు…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, పెద్దపల్లి/
తబిత ఆశ్రమంలో చిన్ననాటి నుంచి ఉంటూ విద్యాభ్యాసం కొనసాగించిన అనాథ బాలిక వి. సంధ్య తన ప్రతిభ, పట్టుదలతో ఎంబీబీఎస్ సీటు సాధించి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
పెద్దపల్లి జిల్లా తబిత ఆశ్రమంలో 1వ తరగతి నుంచి విద్యాభ్యాసం కొనసాగించిన వి. సంధ్య ఇంటర్మీడియట్లో ఏకంగా 955 మార్కులు సాధించింది. చిన్ననాటి నుంచే వైద్య విద్య అభ్యసించాలనే లక్ష్యంతో ముందుకు సాగిన సంధ్యకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక ప్రోత్సాహం అందించారు. ఆమెకు నీట్ ఆన్లైన్ కోచింగ్ అందేలా ఏర్పాట్లు చేయడంతో పాటు చదువుకు అవసరమైన సహకారం, మార్గదర్శకత్వం అందించారు.
తబిత ఆశ్రమంలోనే ఉంటూ ఆన్లైన్ ద్వారా నీట్ కోచింగ్ తీసుకున్న సంధ్య కష్టపడి చదివి మంచి ప్రతిభ కనబరిచింది. తన పట్టుదలతో భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది.
సంధ్య సాధించిన విజయాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. చిన్ననాటి నుంచి ఆశ్రమ సంరక్షణలో పెరిగి, విద్యపై దృష్టి సారించి వైద్య విద్యలో సీటు సాధించడం అభినందనీయమన్నారు. తనకు అందించిన సహాయాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్యాన్ని చేరుకున్న సంధ్య ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
సంధ్య ఎంబీబీఎస్ విద్యను విజయవంతంగా పూర్తి చేసే వరకు అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు.
తబిత ఆశ్రమంలో విద్యాభ్యాసం చేస్తున్న ఇతర బాలబాలికలు కూడా సంధ్యను స్ఫూర్తిగా తీసుకుని విద్యలో రాణించాలని సూచించారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు సరైన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం అందిస్తే వారు ఉన్నత లక్ష్యాలను సాధించగలరని అధికారులు పేర్కొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST