కేటీఆర్ మెప్పు కోసం మంత్రి వివేక్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు….

Sakshitha news

కేటీఆర్ మెప్పు కోసం మంత్రి వివేక్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు….

“ప్రజలు తిరస్కరించినా తీరు మారలేదు.. యువత భవిష్యత్తుతో చెలగాటం వద్దు”….

–ఎంపీ వంశీకృష్ణ…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, చెన్నూర్/ : బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామిపై చేసిన వ్యాఖ్యలను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ మెప్పు పొందేందుకే మంత్రి వివేక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా తన వైఖరిలో మార్పు రాకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

పదేళ్లపాటు ఎంపీగా, ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న బాల్క సుమన్ ప్రజల తీర్పును గౌరవించి, గత అనుభవాలను ఆత్మపరిశీలన చేసుకోవాలని ఎంపీ సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, వారి తీర్పును ప్రతి రాజకీయ నాయకుడు గౌరవించాల్సిందేనని అన్నారు.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి
ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం లేదనే అసహనంతో గోడలు బద్దలు కొడతామని, బాంబులు వేస్తామని, పోలీసు అధికారులపై దాడులు చేస్తామని మాట్లాడటం బాధ్యతారాహిత్యమని వంశీకృష్ణ విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం యువతను రెచ్చగొట్టడం, తప్పుదోవ పట్టించడం మానుకోవాలని హితవు పలికారు.

మంత్రి వివేక్ అభివృద్ధికి కృషి చేస్తున్నారు
మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చెన్నూర్ అభివృద్ధి, విద్య, యువత భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎంపీ తెలిపారు. అలాంటి నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు. విమర్శలు చేయాలనుకుంటే ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని సూచించారు.

యువత భవిష్యత్తుతో చెలగాటం వద్దు
“యువతను రాజకీయాలకు ఉపయోగించుకోవడం కాదు.. వారి భవిష్యత్తును నిర్మించాలి” అని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు. చెన్నూర్ యువత, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు.

గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏం చేశారో ప్రజలు గమనించారని, అందుకే తమ తీర్పును ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజల తీర్పును గౌరవించి నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలని సూచించారు.

తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి అవకాశాలే లక్ష్యం“కేటీఆర్ పిల్లలు మాత్రమే మంచి పాఠశాలల్లో చదవాలా? తెలంగాణ పిల్లలు కూడా జర్మనీ, జపాన్, అమెరికా వంటి దేశాలకు వెళ్లి చదువుకోవాలి. మన పిల్లలకు కూడా ప్రపంచస్థాయి విద్య, ఉద్యోగ అవకాశాలు రావాలి” అని వంశీకృష్ణ అన్నారు.

తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి విద్య, నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మంత్రి వివేక్ వెంకటస్వామి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం 25 వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా యువతకు అవకాశాలు అందించేందుకు ప్రభుత్వం, తమ బృందం కృషి చేస్తోందన్నారు.

ప్రజల కోసం, యువత కోసం, ఉద్యోగాల కోసం చేస్తున్న పోరాటాన్ని ఎన్ని అడ్డంకులు ఎదురైనా కొనసాగిస్తామని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు.
“కేటీఆర్ మెప్పు కోసం అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. ప్రజల తీర్పును గౌరవించండి.. యువత భవిష్యత్తు కోసం పనిచేయండి. మాటల్లో కాదు.. చేతల్లో ప్రజలకు సేవ చేసి చూపించండి” అని బాల్క సుమన్‌కు ఎంపీ సూచించారు.