మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే

Sakshitha news

మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే….!

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి 7 రోజుల జైలు.. 15 మందికి జరిమానా….

కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులు….

సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై రామగుండం ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 16 మందిని గోదావరిఖని ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వెంకట సచిన్ రెడ్డి ఎదుట హాజరుపరిచారు.

వారిలో 15 మందికి మొత్తం రూ.41,500 జరిమానా విధించడంతో పాటు, కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులు చేయించారు. మరో వ్యక్తికి న్యాయస్థానం 7 రోజుల జైలు శిక్ష విధించడంతో అతడిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, రాంగ్ రూట్‌లో ప్రయాణించరాదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. వాహనాలను అతివేగంగా నడపకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.