ఉత్తర తెలంగాణ రైల్వే కనెక్టివిటీకి మరో ముందడుగు…
సిర్పూర్ కాగజ్‌నగర్–హైదరాబాద్ ప్రత్యేక రైలుపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి….
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, పెద్దపల్లి/ : ఉత్తర తెలంగాణ ప్రజల రైల్వే ప్రయాణ సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి కొనసాగుతోంది. సిర్పూర్ కాగజ్‌నగర్–హైదరాబాద్ మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైలు అందుబాటులోకి రావడం ఉత్తర తెలంగాణ ప్రజలకు హైదరాబాద్‌తో రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయనుంది.
పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రాంతాల ప్రజల రైల్వే అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త రైళ్లు, అదనపు నిలుపుదలలు, రైళ్ల పొడిగింపుల కోసం ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే శాఖ, రైల్వే బోర్డుతో నిరంతరం సంప్రదింపులు, ప్రతినిధిత్వాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
రైల్వే కనెక్టివిటీ పెరగడం వల్ల ఉత్తర తెలంగాణ ప్రజలకు హైదరాబాద్‌కు రాకపోకలు సులభతరం కావడంతో పాటు ఉద్యోగాలు, వ్యాపారం, పరిశ్రమలు, విద్య, వైద్యం, పర్యాటక రంగాల్లో అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రయాణికుల సంఖ్య పెరగడం ద్వారా రైళ్ల సామర్థ్య వినియోగం మెరుగుపడి రైల్వే ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందన్నారు.
గతంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు రామగుండంలో నిలుపుదల సాధించేందుకు కృషి చేయడంతో పాటు మంచిర్యాలలోనూ నిలుపుదల కోసం ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. మంచిర్యాలలో నిలుపుదల అందుబాటులోకి రావడం ద్వారా స్థానిక ప్రయాణికులకు మరింత ప్రయోజనం కలగడంతో పాటు రైల్వేకు ఆదాయం పెరిగే అవకాశం ఏర్పడిందన్నారు.
ఇదే తరహాలో సిర్పూర్ కాగజ్‌నగర్–హైదరాబాద్ ప్రత్యేక రైలు సేవలను భవిష్యత్తులో రెగ్యులర్‌గా కొనసాగించేలా రైల్వే శాఖను కోరుతూ ఎంపీ గడ్డం వంశీకృష్ణ తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారని తెలిపారు.
“కనెక్టివిటీ పెరిగితే.. అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఉత్తర తెలంగాణ సమగ్ర అభివృద్ధికి మెరుగైన రైల్వే కనెక్టివిటీ సాధించడమే లక్ష్యం” అని పేర్కొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST