కాంగ్రెస్ హయాంలో వృద్దులు, వితంతువులు, వికలాంగులకు మొండి చెయ్యి
తీగుళ్ళ పద్మారావు గౌడ్ ధ్వజం
సికింద్రాబాద్ : గత బీ. ఆర్. ఎస్. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులు, వితంతువులు, వృద్దుల పింఛన్లు కూడా అందించడంలేదని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ గ్యారెంటీల అమలులో వైఫ్యల్యాలను నిరసిస్తూ శుక్రవారం సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీ. ఆర్. ఎస్. శ్రేణులు భారీ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాయి. అడ్డగుట్ట లో భారీ ఎత్తున ‘వంటా వార్పు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు మహా లక్ష్మీ పధకంలో రూ.2500 మేరకు డబ్బులు చెల్లిస్తామని, తులం బంగారాన్ని కలిపి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి విఫలమైందని తెలిపారు. పింఛన్లు రెట్టింపు చేస్తామని నమ్మించారని ఆరోపించారు.
గత వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన ప్రయోజనం శూన్యమని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాల పై తమ పార్టీ నాయకత్వం ఆందోళన కార్యక్రమాలను ముమ్మరం చేయనుందని తెలిపారు. బీ. ఆర్. ఎస్. సికింద్రాబాద్ యువ నేత రామేశ్వర గౌడ్ మాట్లాడుతూ అన్నీ వర్గాల ప్రజలు ప్రభుత్వం పై విసుగు చెందారని అన్నారు. మాజీ కార్పొరేటర్లు లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్, సామల హేమ, కంది శైలజ, రాసురి సునీత, విజయ కుమారి, అలకుంట సరస్వతిలతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యమకారులు, అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫలమండీ, బౌద్దనగర్, నార్త్ లాలగూడా, లాలాపేట, చిలకలగూడా మున్సిపల్ డివిజన్ల నుంచి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల పై బాకీ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదలతో హోరెత్తి చ్చారు. భారీ బ్యానర్ ను ప్రదర్శించారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST