ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకతకు పీసీఎస్ఏపీ యాప్….
కొనుగోలు కేంద్రాల సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలి….
కృత్రిమ మేధస్సుతో తప్పుడు వివరాలకు చెక్: సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్….
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, పెద్దపల్లి/ : రానున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2026–27లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు కొనుగోలు కేంద్రాల స్మార్ట్ మదింపు (పీసీఎస్ఏపీ) యాప్ను వినియోగించాలని సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు.
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన కనీస సౌకర్యాలు, పీసీఎస్ఏపీ యాప్ వినియోగం, కొనుగోలు కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై రాష్ట్రంలోని అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సివిల్ సప్లైస్ డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో మరింత పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా పీసీఎస్ఏపీ యాప్ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో గన్నీ సంచుల నిల్వ, కొనుగోలు చేసిన ధాన్యం పరిమాణం, రవాణా వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రం పేరు, ప్రదేశం, సీజన్ తదితర ప్రాథమిక వివరాలతో పాటు కేంద్రంలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను స్వీయ మదింపు విధానంలో నమోదు చేయాలని సూచించారు. రైతులకు అందుతున్న సౌకర్యాలు, తూకం, నిల్వ, ధాన్యం నాణ్యత పరీక్ష వంటి అంశాలను కూడా నమోదు చేసి అంచనా వేయనున్నట్లు తెలిపారు.
పీసీఎస్ఏపీ ద్వారా కొనుగోలు కేంద్రాల వారీగా అందుబాటులో ఉన్న సదుపాయాలు, ధాన్యం కొనుగోళ్ల పురోగతి, రవాణా ప్రక్రియను డిజిటల్ విధానంలో పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. కేంద్ర నిర్వాహకులు నమోదు చేసిన వివరాలను సంబంధిత అధికారులు పరిశీలించి ధృవీకరించే విధానం కూడా ఇందులో ఉంటుందని తెలిపారు.
గత సీజన్లలో నమోదైన వివరాల ఆధారంగా కొనుగోలు కేంద్రాల పనితీరు, ప్రస్తుత సీజన్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను అంచనా వేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
పీసీఎస్ఏపీలో కృత్రిమ మేధస్సు ఆధారిత చిత్రాల ధృవీకరణ సాంకేతికతను వినియోగించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన చిత్రాల ఆధారంగా నమోదు చేసిన వివరాలను సాంకేతికంగా ధృవీకరించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. తప్పుడు లేదా వాస్తవ పరిస్థితులకు విరుద్ధమైన వివరాలు నమోదు చేయకుండా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
స్థానిక స్థాయిలో పనిచేసే సిబ్బందికి యాప్ వినియోగం సులభంగా ఉండేలా తెలుగు భాషలోనూ ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల సిబ్బందికి యాప్ వినియోగంపై పూర్తిస్థాయిలో శిక్షణ, అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యేలోపే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. యాప్లో కేంద్రాల వివరాలు, స్వీయ మదింపు, గన్నీ సంచులు, ధాన్యం కొనుగోలు, రవాణా వివరాలు, అవసరమైన చిత్రాల నమోదు, సమాచార ధృవీకరణ వంటి అంశాలపై క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రాయోగిక శిక్షణ అందించాలని స్పష్టం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ తదితర అధికారులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST