ఖని సిమ్స్‌ క్యాంటీన్‌ నిర్వహణపై ఆరోపణలు…

Sakshitha news

ఖని సిమ్స్‌ క్యాంటీన్‌ నిర్వహణపై ఆరోపణలు…

టెండర్ లేకుండా అప్పగించడంపై విచారణ జరిపించాలి..

స్థానిక నిరుద్యోగులకు అవకాశం కల్పించాలి…

— మద్దెల దినేష్…

సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : సింగరేణి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఖని సిమ్స్‌) వైద్య కళాశాలలో క్యాంటీన్‌ నిర్వహణను ఎలాంటి బహిరంగ టెండర్‌ ప్రక్రియ లేకుండానే ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ఫైట్‌ ఫర్‌ బెటర్‌ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ డిమాండ్‌ చేశారు.

కళాశాల ప్రారంభమై సుమారు నాలుగు సంవత్సరాలు గడిచినా క్యాంటీన్‌ నిర్వహణ ద్వారా స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. తాజాగా కళాశాల నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు క్యాంటీన్‌ నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు.

క్యాంటీన్‌ నిర్వహణ కోసం గతంలో బహిరంగ టెండర్లు పిలిచారా? స్థానికులకు సమాచారం ఇచ్చారా? ప్రస్తుతం నిర్వహణకు ఎలాంటి నిబంధనలు, ఒప్పందాలు ఉన్నాయి? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఆధీనంలోని వైద్య కళాశాలలో క్యాంటీన్‌ వంటి నిర్వహణ వ్యవహారాలు పారదర్శకంగా, నిబంధనల ప్రకారమే జరగాలని అన్నారు.

రూ.10 లక్షల ఆరోపణలపై విచారణ జరపాలి
క్యాంటీన్‌ కేటాయింపు వ్యవహారంలో రూ.10 లక్షలు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోందని మద్దెల దినేష్‌ పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవమెంత అన్నది సమగ్ర విచారణ ద్వారా తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రస్తుతం క్యాంటీన్‌లో విద్యార్థుల కోసం టీ, కాఫీ, అల్పాహార పదార్థాలు తదితరాలను విక్రయిస్తున్నారని తెలిపారు. క్యాంటీన్‌ నిర్వహణకు సంబంధించిన టెండర్‌ వివరాలు, నిబంధనలు, ఒప్పంద కాలం, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తదితర అంశాలను బహిరంగపరచాలని డిమాండ్‌ చేశారు.

ఐదు సంవత్సరాల నిర్వహణకు ఒప్పందం కుదిరిందా? కుదిరితే ఏ నిబంధనల ప్రకారం కుదిరింది? ప్రభుత్వానికి ఎంత ఆదాయం సమకూరుతోంది? అనే అంశాలపై అధికారులు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని అన్నారు.

స్థానికులకు అవకాశం ఇవ్వాలి
స్థానిక నిరుద్యోగ యువత క్యాంటీన్‌ నిర్వహణ కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నప్పటికీ వారికి అవకాశం ఇవ్వకుండా ఇతర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించడం అన్యాయమని మద్దెల దినేష్‌ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్యాంటీన్‌ నిర్వహణ జరుగుతున్నట్లు తేలితే ప్రస్తుత నిర్వహణను నిలిపివేసి, పారదర్శకమైన టెండర్‌ ప్రక్రియ నిర్వహించి స్థానిక నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని కోరారు.

క్యాంటీన్‌ కేటాయింపుపై వచ్చిన రూ.10 లక్షల ఆరోపణలపై జిల్లా కలెక్టర్‌ సమగ్ర విచారణకు ఆదేశించాలని, వైద్య విద్యాశాఖ మంత్రి, వైద్య విద్యా సంచాలకులు స్పందించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై వైద్య విద్యా సంచాలకులు, వైద్యశాఖ మంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.