రామగుండం ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ….

Sakshitha news

రామగుండం ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ….

యోగా–ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తున్న దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సమంత….

విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎన్‌టీపీసీ అండ….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ : విద్యార్థుల విద్యాభ్యాసానికి తోడ్పాటు అందించడంతో పాటు వారి శారీరక, మానసిక వికాసానికి ప్రోత్సాహం అందించేలా ఎన్‌టీపీసీ రామగుండం సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహించింది. నాలుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 71 సైకిళ్లను పంపిణీ చేశారు.

పాఠశాలలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని సౌకర్యవంతంగా కొనసాగించేందుకు ఈ సైకిళ్లు ఉపయోగపడనున్నాయి. విద్యార్థుల అవసరాలను గుర్తించి సామాజిక బాధ్యతలో భాగంగా ఎన్‌టీపీసీ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

అదేవిధంగా పాల్గొన్న పాఠశాలలకు చెందిన 8, 9వ తరగతి విద్యార్థులకు యోగా, ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, మానసిక ప్రశాంతత పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు శ్రీమతి రాఖీ సమంత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీప్తి మహిళా సమితి సీనియర్ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.
విద్యార్థులకు విద్యా సహకారంతో పాటు వారి సమగ్ర అభివృద్ధి, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఎన్‌టీపీసీ రామగుండం సామాజిక బాధ్యత కార్యక్రమాలను కొనసాగిస్తోందని నిర్వాహకులు తెలిపారు.