గాంధీచౌక్‌లో పోలీసుల మెరుపు తనిఖీలు….
మత్తు పదార్థాల కట్టడికి నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో విస్తృత సోదాలు.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు….
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని, : మాదకద్రవ్యాల నిర్మూలన, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు గాంధీచౌక్ పరిసరాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహకారంతో చేపట్టిన ఈ తనిఖీలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
గోదావరిఖని వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఆఫ్జాలోద్దీన్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు పలు దుకాణాలు, పాన్‌షాపులు, టీ స్టాళ్లు, నూతన నిర్మాణ ప్రాంతాలు, యువత ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.
మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, నిల్వ, వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా తరచూ తనిఖీలు నిర్వహించడంతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయం, నిల్వ లేదా వినియోగానికి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదకద్రవ్యాల నియంత్రణలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు.
నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బందితో పాటు నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST