ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలకు తరలిరండి….

Sakshitha news

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలకు తరలిరండి….

కరీంనగర్‌లో సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో మహాసభలు….

కార్మిక వర్గానికి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ పిలుపు…..

సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, మంథని/ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో నిర్వహించనున్న ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.

మంథనిలో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను కడారి సునీల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటాలకు, ఉద్యమాలకు, విప్లవాలకు కరీంనగర్ జిల్లా కేంద్రం చారిత్రకంగా ఊపిరిగా నిలిచిందన్నారు. అలాంటి కరీంనగర్ గడ్డపై ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు నిర్వహించడం సంతోషకరమన్నారు.

సెప్టెంబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం నుంచి సర్కస్ గ్రౌండ్ వరకు భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం అక్కడ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. సెప్టెంబర్ 7, 8 తేదీల్లో పద్మనాయక కళ్యాణ మండపంలో రాష్ట్ర మహాసభలు కొనసాగుతాయని వెల్లడించారు.

రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఏఐటీయూసీ ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతారని తెలిపారు. మహాసభల్లో జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు కార్మికులు, ఉద్యోగుల స్థితిగతులు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు చెప్పారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్‌లో చేపట్టాల్సిన పోరాట కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.

పెద్దపల్లి జిల్లాలోని కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో కరీంనగర్‌కు తరలివచ్చి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కడారి సునీల్ కోరారు. కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అనిల్, సదయ్య, రమేష్, కళ్యాణ్, రాకేష్, రామ్మూర్తి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.