చెత్తను వేరు చేద్దాం.. సంపదగా మార్చుకుందాం

Sakshitha news

చెత్తను వేరు చేద్దాం.. సంపదగా మార్చుకుందాం

ఎన్‌టీపీసీ రామగుండంలో వ్యర్థాల వేరు చేయడంపై అవగాహన.. ‘వేస్ట్‌ టు వ్యాల్యూ’ కార్యక్రమం….

సాక్షిత న్యూస్ పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, రామగుండం/ ఆగస్టు 30: పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన టౌన్‌షిప్‌ నిర్మాణమే లక్ష్యంగా ఎన్‌టీపీసీ రామగుండం పర్యావరణ నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో వ్యర్థాల వేరు చేయడంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. టౌన్‌షిప్‌లో చెత్త సేకరణ కార్మికులకు చెత్తను తడి, పొడి, పునర్వినియోగ వ్యర్థాలుగా వేరు చేయడం, సురక్షితంగా సేకరించడం, శాస్త్రీయ పద్ధతిలో తరలించి నిర్వహించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

చెత్త సేకరణ, రవాణా సమయంలోనూ వ్యర్థాల వేరు ప్రక్రియ కొనసాగించాలని, పునర్వినియోగానికి అనువైన వస్తువులను సరైన మార్గంలో రీసైక్లింగ్‌కు పంపించాలని సూచించారు.

అనంతరం పర్యావరణ నిర్వహణ విభాగం, డీఆర్‌సీసీ గౌతమి నగర్‌ సమన్వయంతో టౌన్‌షిప్‌ నివాసితుల కోసం “వేస్ట్‌ టు వ్యాల్యూ – వ్యర్థాలతో ఆదాయం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నివాసితులు వేరు చేసిన కాగితం, అట్టపెట్టెలు, ప్లాస్టిక్‌, ఇనుము, ఇతర లోహాలు, గాజు తదితర పొడి, పునర్వినియోగ వ్యర్థాలను తీసుకువచ్చి అందజేశారు.

పునర్వినియోగ వ్యర్థాలను వేరు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు వాటికి ఆర్థిక విలువ కూడా ఉంటుందని ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యర్థాల మూలస్థాయిలోనే వేరు చేయడం, పునర్వినియోగం, బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

టౌన్‌షిప్‌ నివాసితులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడంతో పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన, వ్యర్థ రహిత టౌన్‌షిప్‌ కోసం ఎన్‌టీపీసీ రామగుండం చేస్తున్న కృషికి మరింత బలం చేకూరింది