మంత్రి కొండా సురేఖ ఆత్మవిమర్శ చేసుకోవాలి: ప్రభుత్వ విప్ విజయరమణ రావు…

Sakshitha news

మంత్రి కొండా సురేఖ ఆత్మవిమర్శ చేసుకోవాలి: ప్రభుత్వ విప్ విజయరమణ రావు…

కూతురు వ్యాఖ్యలను ఖండించకపోవడం విచారకరం.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, హైదరాబాద్/ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి ఖండించకపోవడం విచారకరమని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. మంత్రి కొండా సురేఖ తన వైఖరిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌లోని అసెంబ్లీ సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద సహచర ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో విజయరమణ రావు మాట్లాడారు. తన కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ చెప్పడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులపై కుటుంబ సభ్యులు విమర్శలు చేస్తున్న సమయంలో మంత్రి బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి చేసిన పోరాటం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగాలు, కష్టాల ఫలితంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని విజయరమణ రావు పేర్కొన్నారు. ఎన్నో అవమానాలు, నిర్బంధాలు, కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడారని అన్నారు.

ఎంతోమంది అర్హులు ఉన్నప్పటికీ సీనియర్ నాయకురాలిగా గుర్తించి బీసీ మహిళగా కొండా సురేఖకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన మంత్రి పదవి కల్పించిందని తెలిపారు. అలాంటి పదవిలో కొనసాగుతూ ముఖ్యమంత్రిపై కుటుంబ సభ్యులు విమర్శలు చేయడం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మనోభావాలను బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కూతుళ్లు, కుమారులు చేసే పనులకు తల్లిదండ్రులు బాధ్యత వహించడం సహజమని, కనీస సంప్రదాయాలను కూడా పక్కనపెట్టి తన ఇంట్లోనే ఉంటున్న కుమార్తె ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ మంత్రి ఎందుకు ఖండించడం లేదని విజయరమణ రావు ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోరాటం, పార్టీ కార్యకర్తల కృషి కీలకమని, పార్టీ ఐక్యతను దెబ్బతీసే వ్యాఖ్యలకు స్వస్తి పలికి మంత్రి కొండా సురేఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వ విప్ విజయరమణ రావు సూచించారు.

Scroll to Top