మంత్రి కొండా సురేఖ ఆత్మవిమర్శ చేసుకోవాలి….
కూతురు సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం విచారకరం
— ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, హైదరాబాద్/ : మంత్రి పదవిలో కొనసాగుతూనే తన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేయడం పట్ల మంత్రి కొండా సురేఖ ఆత్మవిమర్శ చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు.
హైదరాబాద్ అసెంబ్లీ సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద సహచర ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి కొండా సురేఖ తన కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని చెప్పడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులపై తీవ్ర విమర్శలు చేసిన తన కూతురు వ్యాఖ్యలను మంత్రి ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి చేసిన పోరాటం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగాలు, కష్టాల ఫలితంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఎంతోమంది అర్హులు ఉన్నప్పటికీ సీనియర్ నాయకురాలిగా, బీసీ మహిళగా గుర్తించి కొండా సురేఖకు కీలకమైన మంత్రి పదవి కల్పించారని తెలిపారు.
అలాంటి పదవిని అనుభవిస్తూ ముఖ్యమంత్రిపైనే కుటుంబ సభ్యులు విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తోందని రాజ్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు. కూతుళ్లు, కుమారులు చేసే పనులకు తల్లిదండ్రులు బాధ్యత వహించడం సహజమని, కనీస సంప్రదాయాలను కూడా పక్కన పెట్టి కూతురు వ్యాఖ్యలను ఖండించకపోవడం సరికాదన్నారు.
ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యల విషయంలో మంత్రి కొండా సురేఖ స్పష్టమైన వైఖరి వెల్లడించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
