ఆటో డిమాండ్ల సాధనకు కదిలిన కార్మికులు…
హామీలు అమలు చేయాలి.. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం ఆపేది లేదు….
సాక్షిత పెద్దపల్లి, : ఆటో కార్మికుల సమస్యలు, సంక్షేమ డిమాండ్ల పరిష్కారం కోసం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వందలాది ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆటో జేఏసీ జిల్లా కన్వీనర్ ఎనగందుల నాంపల్లి అధ్యక్షతన పెద్దపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్ వరకు కొనసాగింది. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్, ఆటో జేఏసీ జిల్లా గౌరవ అధ్యక్షులు వ్యాళ్ల హరీష్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు, నెలకు రూ.12 వేల ఆర్థిక సాయం, ఆటోనగర్ల ఏర్పాటు తదితర హామీలను అమలు చేయాలని కోరారు.
డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆటోల నిరవధిక బంద్‌ను ప్రభుత్వం దిగివచ్చే వరకు కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా హైవే రోడ్ల దిగ్బంధం, 25న హైదరాబాద్ సచివాలయం ముట్టడి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్.కే. జబ్బర్, రాష్ట్ర నాయకులు కాంపెల్లి శ్రీనివాస్, జిల్లా కో-కన్వీనర్లు బంధారపు శంకర్, బండ సురేష్, ఎస్.కే. జావీద్, రామగుండం ఇన్చార్జి మడిపెద్ది రమేష్, రామగుండం అధ్యక్షులు ఎస్.డి. బురహాన్, పాలకుర్తి అధ్యక్షులు బెక్కం శంకర్, పెద్దపల్లి ఇన్చార్జి యాదగిరి శంకర్, పెద్దపల్లి మండల కన్వీనర్ ఈర్ల శంకర్, పెద్దపల్లి పట్టణ కన్వీనర్ గాండ్ల సత్యం, సుల్తానాబాద్ మండల అధ్యక్షులు తాడూరి రమేష్, శ్రీధర్, అన్ను, చిలుముల స్వామి, బెక్కం రవి, నిజాం, వంశీ, కొండపలకల దేవయ్య తదితరులు పాల్గొన్నారు. వందలాది ఆటో డ్రైవర్లు ర్యాలీలో పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
