సుజాతానగర్‌లో వృద్ధురాలి మెడలో బంగారు గొలుసులు లాక్కెళ్లిన తల్లి–కొడుకులు అరెస్ట్
రూ.9 లక్షల విలువైన 5 తులాల బంగారం స్వాధీనం – నేరానికి ఉపయోగించిన హోండా యాక్టివా సీజ్
విశాఖపట్నం, : పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుజాతానగర్‌లో వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు ఆభరణాలను లాక్కెళ్లిన తల్లి–కొడుకులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.9 లక్షల విలువైన 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజాతానగర్‌కు చెందిన కీలపర్తి చెల్లయ్యమ్మ గత జూన్ 27వ తేదీ సాయంత్రం తన బంధువుల ఇంట్లో జరిగే కార్యక్రమానికి వెళ్లేందుకు నడుచుకుంటూ వెళ్తుండగా లిటిల్ ఫ్లవర్ ప్లే స్కూల్ సమీపంలో నీలిరంగు హోండా యాక్టివాపై వచ్చిన ఓ మహిళ, ఓ యువకుడు ఆమెను అడ్రస్ అడిగినట్లు నటించారు. బాధితురాలు సమాధానం చెప్పేలోపే స్కూటీపై నుంచి దిగిన మహిళ ఆమె మెడలో ఉన్న రెండు వరుసల బంగారు నల్లపూసల గొలుసు, బంగారు పుస్తెల తాడును లాక్కొని, ఇద్దరూ వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు కేకలు వేసినా ప్రయోజనం లేకపోయింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ (క్రైమ్స్) శ్రీమతి కె. లతా మాధురి ఐపీఎస్ పర్యవేక్షణలో, వెస్ట్ సబ్‌డివిజన్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ఎం. చంద్రమౌళి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిందితులను గుర్తించి అరెస్ట్ చేసింది.
అరెస్టైన నిందితులు మాదివాడ ధనలక్ష్మి (38), ఆమె కుమారుడు మాదివాడ అక్షిత్ (19)గా పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు రూ.9 లక్షల విలువైన 5 తులాల బంగారు ఆభరణాలను, నేరానికి ఉపయోగించిన హోండా యాక్టివా (ఏపీ39 కేడీ 5568)ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన వెస్ట్ సబ్‌డివిజన్ క్రైమ్ సీఐ ఎం. చంద్రమౌళి, ఎస్‌ఐ డి. సూరిబాబు, ఏఎస్‌ఐ కె. శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీసు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు అభినందించారు.

