మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సమాజం అండగా నిలవాలి..
పెందుర్తి మండలంలో వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో అడ్వకసీ సమావేశం
పెందుర్తి, (సాక్షిత) : వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ‘సాంత్వన’ ప్రాజెక్టు ద్వారా పెందుర్తి మండలంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాల సందర్భంగా సోమవారం పెందుర్తి ఎం.డి.ఓ. కార్యాలయంలో కమ్యూనిటీ కీలక వ్యక్తులతో అడ్వకసీ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు గండ్రెడ్డి మాలతి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సమాజం అండగా నిలవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించడంలో వాసవ్య మహిళా మండలి సిబ్బందికి ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సహకరించాలని కోరారు.
మండల అభివృద్ధి అధికారి జి. అప్పలరాజు మాట్లాడుతూ, సమాజంలో మానసిక ఆరోగ్య సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వాసవ్య మహిళా మండలి చేపడుతున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
వైద్యాధికారి డాక్టర్ కె. చారిష్మా మాట్లాడుతూ, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా వైద్య చికిత్స పొందాలని, సకాలంలో చికిత్స అందితే వారు సాధారణ జీవితాన్ని గడపగలరని తెలిపారు.
వాసవ్య మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఎం. అబ్రహాం మాట్లాడుతూ, ‘సాంత్వన’ ప్రాజెక్టు ద్వారా మానసిక ఆరోగ్య అవగాహన, రోగుల గుర్తింపు, చికిత్స, కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందిస్తున్నట్లు వివరించారు.
ప్రాజెక్టు కోఆర్డినేటర్ చి. హేమ ప్రాజెక్టు సిబ్బంది బాధ్యతలు, కమ్యూనిటీ కీలక వ్యక్తుల పాత్ర, పరస్పర సహకారం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సమావేశంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, వెలుగు ప్రాజెక్టు సిబ్బంది, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు కలిపి సుమారు 50 మంది కమ్యూనిటీ కీలక వ్యక్తులు పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని సూపర్వైజర్ వెంకట కృష్ణ సమన్వయం చేయగా, వాసవ్య మహిళా మండలి సిబ్బంది అనిల్, రూప, కుమారి, మల్లేశ్వరి, ప్రియాంక, లిఖిత తదితరులు పాల్గొన్నారు.

