ప్రతి బొగ్గు పెళ్లలో సింగరేణి కార్మికుడి గుండె చప్పుడు ఉంది….

Sakshitha news

ప్రతి బొగ్గు పెళ్లలో సింగరేణి కార్మికుడి గుండె చప్పుడు ఉంది….

–నటుడు, జనసేన నాయకుడు ర్.కే. సాగర్..

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీ వద్ద సింగరేణి అధికారుల సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఏడో రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కోరుతూ అధికారులు కొనసాగిస్తున్న ఈ ఉద్యమానికి జనసేన పార్టీ తెలంగాణ ప్రచార కార్యదర్శి మొగిలిరేకుల ఆర్.కే. సాగర్ సంఘీభావం ప్రకటించారు.

దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన అధికారుల సమస్యలను తెలుసుకుని, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా ఆర్.కే. సాగర్ మాట్లాడుతూ, సింగరేణి కేవలం బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థ మాత్రమే కాదని, లక్షలాది కుటుంబాల జీవనాధారమని అన్నారు. సంస్థ అభివృద్ధిలో కార్మికులతో పాటు అధికారులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి అధికారులు తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి రావడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

ప్రతి బొగ్గు పెళ్లలో సింగరేణి కార్మికుడి చెమట, గుండె చప్పుడు దాగి ఉందని పేర్కొన్న ఆయన, దేశ పారిశ్రామికాభివృద్ధికి, విద్యుత్ ఉత్పత్తికి సింగరేణి అందిస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడారు. దేశానికి వెలుగునందించేందుకు అనేక మంది కార్మికులు ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర రామగుండం నేలకు ఉందని గుర్తుచేశారు.

రామగుండం ఉద్యమాల పురిటిగడ్డగా చరిత్రలో నిలిచిందని, తెలంగాణ ఉద్యమం నుంచి కార్మిక హక్కుల పోరాటాల వరకు ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ ముందుండి పోరాడారని అన్నారు. అలాంటి ప్రాంతంలో అధికారులు ఉద్యమబాట పట్టడం వెనుక ఉన్న కారణాలను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించి, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

“ఇకనైనా కూలగొట్టే కార్యక్రమాలు కాదు… కట్టడాలపై దృష్టి పెట్టాలి” అని ప్రభుత్వానికి సూచించిన ఆయన, సమస్యలను మరింత జటిలం చేయకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ ఏర్పాటులో సింగరేణి కార్మికుల పాత్ర కీలకమని, వారి ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు. అధికారుల న్యాయమైన డిమాండ్లను పెండింగ్‌లో ఉంచడం వల్ల సంస్థలో అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష పెన్‌డౌన్ ఉద్యమంగా మారితే సింగరేణి పరిపాలన, ఉత్పత్తి, నిర్వహణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

తాను రాజకీయ నాయకుడిగా కాకుండా సింగరేణి కార్మికుడి బిడ్డగా ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నానని స్పష్టం చేసిన ఆర్.కే. సాగర్, కార్మికులు, అధికారులు ఇద్దరూ సంస్థకు రెండు కళ్లు లాంటివారని, వారి సంక్షేమం పరిరక్షించినప్పుడే సింగరేణి మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రభుత్వం, యాజమాన్యం ఆలస్యం చేయకుండా అధికారుల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారుల సంఘం నాయకులు దిటి చంద్రమౌళి, రావుల దామోదర్, డా. సందీప్, బైరి రాజు, హేమంత్, రాజేశ్వర్ రావు, సద్దాం హుస్సేన్, అధికారులు, ఉద్యోగులు, జనసేన నాయకులు రావుల మధు, బేతి మహేందర్, రాజిరెడ్డి, హరీష్, రసూరి హరి, జనార్దన్, అరవింద్, రమేష్, మాయ రమేష్, తగరపు శ్రీనివాస్, కాస రాజు, మంథని శ్రవణ్, రాజేంద్ర ప్రసాద్, ఉదయ్ రెడ్డి, విశ్వజ్ఞ, ఆశ్రీత్, రాజశేఖర్, బషీర్, బూస శ్రీనివాస్, మేకల సంతోష్, వీరమహిళలు మణిత, మంగా, లావణ్యతో పాటు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలిపారు.

Scroll to Top