ప్రజల భాగస్వామ్యంతో ప్రతి డివిజన్‌ను క్రైమ్ ఫ్రీగా తీర్చిదిద్దాలి….
–డీసీపీ బి. రామ్‌రెడ్డి…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి డివిజన్‌ను నేరరహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ డీసీపీ బి. రామ్‌రెడ్డి సూచించారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన డీసీపీకి ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐలు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసు సిబ్బంది ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించిన ఆయన, స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, విధి నిర్వహణ, సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.
తదుపరి పోలీసు సిబ్బందితో పరేడ్ నిర్వహించి వారి స్క్వాడ్ డ్రిల్, నీట్ టర్న్‌అవుట్‌ను పరిశీలించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు ప్రకటించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల పరిష్కారం, శాంతిభద్రతల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని తగిన సూచనలు చేశారు.
అనంతరం గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 35 డివిజన్లకు నియమితులైన డివిజన్ పోలీస్ ఆఫీసర్లతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి డివిజన్‌లో ఆస్తి సంబంధిత నేరాలు, మహిళలపై నేరాలు, సైబర్ నేరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. నంబర్ ప్లేట్‌లు లేని, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.
యువత, ప్రజాప్రతినిధులు, స్థానిక పెద్దలతో కలిసి స్ట్రీట్ కార్నర్ సమావేశాలు, కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణ, నేరాల నియంత్రణపై అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి, మాదకద్రవ్యాలు, ఆన్‌లైన్ బెట్టింగ్, లోన్ యాప్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ యువతను సామాజిక సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహించాలని తెలిపారు.
ప్రతి డివిజన్‌లోని కీలక ప్రాంతాలు, ఆసుపత్రులు, దేవాలయాలు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని, ఆయా సంస్థల భద్రతా సిబ్బంది, నిర్వాహకుల వివరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. డివిజన్ పోలీస్ ఆఫీసర్లు వారానికి రెండు నుంచి మూడు సార్లు తమ పరిధిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని, వార్డు అధికారులతో కలిసి నైట్ హార్ట్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని డీసీపీ బి. రామ్‌రెడ్డి ఆదేశించారు.
ఈ తనిఖీల్లో గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, అఫ్జలుద్దీన్, ఎస్‌ఐలు రమేష్, మనోహర్, అనూష తదితరులు పాల్గొన్నారు.

