సంపద కార్పొరేట్లకు… భారాలు ప్రజలకు – ఇదే మోడీ ఆర్థిక విధానం
సాక్షిత : ధరల దోపిడీపై, ప్రజలపై మోపిన భారాన్ని వెంటనే తగ్గించాలి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ముందు CPI ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నా
వియస్. బోస్, సీపీఐ
రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్–డీజిల్, వంటగ్యాస్, విద్యుత్ చార్జీలు, విద్యా–వైద్య ఖర్చులు నిరంతరం పెరుగుతూ సామాన్య ప్రజల జీవనాన్ని దుర్భరంగా మారుస్తున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమయ్యాయని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తీవ్రంగా ఖండిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వియస్. బోస్ అన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి సమితి పిలుపులో భాగంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఐ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నా నిర్వహించారు.
ఈ సందర్బంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వియస్. బోస్. మాట్లాడుతూ ప్రజల జీవన వ్యయం ఎంత బాగా పెరిగిందని, 2014లో సుమారు ₹410 ఉన్న గృహ వినియోగ LPG సిలిండర్ ధర ప్రస్తుతం ₹1150 దాటిందన్నారు, అంటే 100 శాతానికి పైగా పెరుగుదల అయిందన్నారు. పెట్రోల్ ధరలు లీటర్కు ₹70 నుండి ₹117కు చేరుకున్నాయని, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగాయన్నారు. వంటనూనె ధరలు కొన్నేళ్లలో లీటర్కు ₹90–100 నుండి ₹170–200 వరకు పెరిగాయని, పప్పుధాన్యాలు, కూరగాయలు, పాలు, గుడ్లు, బియ్యం ధరలు కూడా నిరంతరం పెరుగుతుండటంతో ఒక మధ్యతరగతి కుటుంబం నెలవారీ ఖర్చు గత దశాబ్దంలో దాదాపు రెట్టింపు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో “అచ్చే దిన్”, “అభివృద్ధి” పేరుతో గొప్పలు చెప్పిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ
నేడు ధరల పెరుగుదలపై ఒక్క మాట మాట్లాడటం లేదన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదన్నారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రాయితీలు ఇచ్చే ప్రభుత్వాలకు ప్రజలకు సబ్సిడీలు ఇవ్వడం భారంగా ఎందుకు కనిపిస్తోందని, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే, మార్కెట్లో మాత్రం అధిక ధరలకు ఎవరు బాధ్యులు అని వారు ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వాలు కనీసం ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమవుతున్నాయన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంటే ప్రభుత్వాలు ఎవరికి పాలన చేస్తున్నాయని, దేశ సంపద కొద్దిమందికే – కష్టాలు కోట్లాది ప్రజలకా అని వారు ఏద్దేవా చేశారు. ఒకవైపు కొద్దిమంది కార్పొరేట్ సంస్థల సంపద లక్షల కోట్ల రూపాయల మేర పెరుగుతుంటే, మరోవైపు సాధారణ కుటుంబాలు నెలాఖరు ఖర్చులు తీర్చలేని పరిస్థితికి చేరుకున్నాయన్నారు . ఇది ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాల ఫలితమేనని వారు ఆరోపించారు.
ఈ సందర్బంగా సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్. మాట్లాడుతూ ప్రజల కష్టాలు పట్టించుకోకుండా ప్రచార ఆర్భాటాలకు, కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సీపీఐ హెచ్చరిస్తోందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే నియంత్రించాలని, పెట్రోల్, డీజిల్, LPG గ్యాస్ ధరలను తగ్గించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రైతులకు గిట్టుబాటు ధరలు, వినియోగదారులకు సరసమైన ధరలు అందించాలని,
విద్య, వైద్యం, విద్యుత్, రవాణా రంగాలలో ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించాలని, నిల్వదారులు, కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ధర్నా అనంతరం సిపిఐ కార్యవర్గం జిల్లా డి ఆర్ ఓ మాలతీ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
నిర్వహించిన ధర్నాలో ప్రజా నాట్యమండలి కళాకారులు ఆలపించిన గేయాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. CPI నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువజనులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ధరల పెరుగుదలపై ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టకపోతే CPI ఆధ్వర్యంలో మరింత ఉధృతమైన ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు జీ. దామోదర్ రెడ్డి, డీజీ. సాయిలు గౌడ్,
తోటపల్లి శంకర్, హరినాథ్ రావు,కె. స్వామి, టి. సత్య ప్రసాద్, రచ్చ కిషన్,నిమ్మల నర్సింహా, యాదయ్య గౌడ్,కృష్ణ, లక్ష్మీ, ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె. ధర్మేంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి. లక్ష్మణ్, మండల కార్యదర్శులు దర్శనం యాదగిరి, స్వామి,పి.శ్రీనివాస్, బాబు,నాగరాజు,నరేంద్ర ప్రసాద్, ఈశ్వర్,రాములు గౌడ్, ప్రజానాట్యమండలి అధ్యక్ష, కార్యదర్శులు ప్రమీల,వెంకటాచారి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు హైమావతి గిరిజన సమాఖ్య స్వరూప జిల్లా కౌన్సిల్ సభ్యులు నర్సింహా రెడ్డి, మాధవి, రాంనారాయణ, నర్సింహ,మహాలక్ష్మి,బాపిరాజు,బాలరాజ్,జయచంద్ర, ఇస్తరి,దస్తగిరి, వెంకటరమణ,బషీర్,ఆన్వార్, మహేష్,అజీజ్,గిరిజ,మణెమ్మ,రమ,సదానంద్,నర్సింహారెడ్డి,బాబు,జంగయ్య,అశోక్,వెంకటేష్ లతో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
