గంజాయి రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి – పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్‌లో గంజాయి , ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారిలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డి-అడిక్షన్ సెంటర్‌ను పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి సందర్శించారు.
గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డి-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న యువకులతో డీసీపీ మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, చికిత్స విధానం గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి నార్కోటిక్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారిని గౌరవ న్యాయస్థానం ఆదేశాల మేరకు 15 రోజుల పాటు డి-అడిక్షన్ సెంటర్‌కు పంపిస్తున్నామని తెలిపారు.
అక్కడ వారికి వైద్య చికిత్సతో పాటు మానసికంగా మార్పు తీసుకురావడానికి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గంజాయి సరఫరా చేసే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, అలాగే గంజాయి సేవించే వారిని గుర్తించి వారిని ఆ అలవాటు నుంచి దూరం చేస్తే సరఫరా కూడా తగ్గే అవకాశముందని డీసీపీ అన్నారు.
తల్లిదండ్రులు, పెద్దలు తమ పరిసరాల్లో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నా లేదా సేవిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పోలీసులు స్పందించి నిందితులపై కేసులు నమోదు చేసి నార్కోటిక్ పరీక్షలు నిర్వహిస్తారని, పాజిటివ్‌గా తేలిన వారిని డి-అడిక్షన్ సెంటర్లకు పంపించి చికిత్స అందిస్తామని తెలిపారు.
నిపుణులైన వైద్యుల సహాయంతో మత్తు బారిన పడిన వ్యక్తులు తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చే అవకాశం ఉందని, డ్రగ్స్ రహిత పెద్దపల్లి జిల్లాను నిర్మించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని డీసీపీ రామ్ రెడ్డి కోరారు.
ఈగల్ డైరెక్టర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, నార్కోటిక్ పెద్దపల్లి ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్, రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు, వైద్య అధికారులు, సిబ్బంది, గంజాయికి బానిసై డి-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న వారితో కలిసి గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా మొక్కలు నాటారు.

