ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం, రామగుండం నియోజకవర్గంలోని బసంత్‌నగర్, పాలకుర్తి, కొత్తపల్లి, రామారావుపల్లి, గోలివాడ గ్రామాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో సోమవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. నూతన గృహాల్లోకి ప్రవేశించిన లబ్ధిదారులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేసి, వారి ఆనందంలో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు గౌరవప్రదమైన జీవనం గడపడానికి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ద్వారా అనేక కుటుంబాలు శాశ్వత నివాస సౌకర్యాన్ని పొందుతున్నాయని, భవిష్యత్తులో కూడా ప్రజా సంక్షేమం కోసం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
