ఉద్యోగుల సంక్షేమం, భద్రతే సింగరేణి ప్రగతికి బలమైన పునాది….

Sakshitha news

ఉద్యోగుల సంక్షేమం, భద్రతే సింగరేణి ప్రగతికి బలమైన పునాది….

—సింగరేణి సీఎండీ డా. బుద్ధప్రకాశ్ జ్యోతి….


సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం,
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ డా. బుద్ధప్రకాశ్ జ్యోతి శుక్రవారం రామగుండం-1 ఏరియాలో విస్తృతంగా పర్యటించి గనుల ఉత్పత్తి, ఉద్యోగుల సంక్షేమం, భద్రతా చర్యలు మరియు సంస్థ కల్పిస్తున్న వివిధ సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు.
పర్యటనలో భాగంగా జీడీకే-11 ఇన్‌క్లైన్ గనిలో ఉద్యోగులు, అధికారులు, కార్మికులతో సీఎండీ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. సంస్థ అభివృద్ధికి సంబంధించిన సూచనలు స్వీకరించి, బొగ్గు ఉత్పత్తి పెంపు, ఉత్పాదకత, నాణ్యత మెరుగుదల మరియు భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు.

ఈ సందర్భంగా డా. బుద్ధప్రకాశ్ జ్యోతి మాట్లాడుతూ సింగరేణి సంస్థకు ఉన్న అపార అనుభవం, క్రమశిక్షణ, సమష్టి పనితత్వమే సంస్థను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని అన్నారు. ఉత్పత్తి పెంపుతో పాటు ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.
గనిలో ఏర్పాటు చేసిన 5వ మ్యాన్ రైడింగ్ సిస్టమ్‌ను సీఎండీ ప్రారంభించారు. ఈ వ్యవస్థ ద్వారా ఉద్యోగులు భూగర్భ పనిస్థలాలకు సురక్షితంగా, వేగంగా చేరుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. దీంతో కార్మికుల శారీరక శ్రమ తగ్గుతుందని పేర్కొన్నారు.

మ్యాన్ రైడింగ్ సిస్టమ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను సీఎండీ అభినందించి సన్మానించారు. వారి అంకితభావం, కృషిని ప్రశంసించారు.

డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ మాట్లాడుతూ జీడీకే-11 గని సింగరేణిలో ఉత్పాదకత, మెకనైజేషన్ పరంగా రెండవ అతిపెద్ద గని అని తెలిపారు. ఆధునిక యంత్రాలను సమర్థవంతంగా వినియోగించి ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని సూచించారు.

డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గనిని జీరో లాస్ స్థాయికి తీసుకెళ్లి లాభదాయకంగా నిర్వహించేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రస్తుతం ఒక మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో 1.5 మిలియన్ టన్నుల స్థాయికి అభివృద్ధి చేయాలని అన్నారు.

తదుపరి సీఎండీ జీడీకే-5 ఓపెన్‌కాస్ట్ గనిని సందర్శించి బొగ్గు, ఓవర్‌బర్డెన్ ఉత్పత్తి, రవాణా, యంత్రాల వినియోగం మరియు ఉత్పాదకతపై సమీక్ష నిర్వహించారు. భద్రత, సామర్థ్యం, నాణ్యతను కాపాడుతూ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం రామగుండం-1 ఏరియాలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంను సందర్శించి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన క్రీడా, వినోద సౌకర్యాలను పరిశీలించారు. ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం కోసం క్రీడలు, ఆరోగ్యకరమైన వినోద కార్యక్రమాలను మరింత ప్రోత్సహించాలని సూచించారు.

తదుపరి జనరల్ మేనేజర్ కార్యాలయంలో అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి బొగ్గు ఉత్పత్తి, భద్రతా ప్రమాణాలు, నాణ్యత, వ్యయ నియంత్రణ చర్యలు మరియు భవిష్యత్తు లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షులు వి. సీతారామయ్య, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) ఎం. తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీవీవో (కోల్ మూవ్‌మెంట్) బి. వెంకన్న, జీఎం (సీడీఎన్) & మార్కెటింగ్ టి. శ్రీనివాస్, రామగుండం-1 ఏరియా జీఎం డి. లలిత్ కుమార్, రామగుండం-3 ఏరియా జీఎం మధుసూదన్, రామగుండం-2 ఏరియా ఇన్‌ఛార్జ్ జీఎం రాముడు పాల్గొన్నారు.

వీరితో పాటు వివిధ విభాగాల శాఖాధిపతులు, అధికారులు, యూనియన్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Scroll to Top