ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించాలి…
ఓటరు జాబితా సవరణలో పారదర్శకత తప్పనిసరి…
—సీఈఓ సుదర్శన్ రెడ్డి…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
ఎస్‌ఐఆర్ కార్యక్రమం ద్వారా ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్‌ఐఆర్ కార్యక్రమం, మ్యాపింగ్ పురోగతిపై సమీక్ష చేపట్టారు.
జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఈఓ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, 1950 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 సార్లు ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో గతంలో 2002లో ఎస్‌ఐఆర్ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. శాశ్వతంగా వలస వెళ్లిన వారు, మరణించిన ఓటర్ల పేర్లు, డబుల్ ఎంట్రీలను తొలగించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
అక్టోబర్ 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించనున్నట్లు వెల్లడించారు. జూన్ 24 నుంచి జూలై 25 వరకు బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పూర్తిస్థాయిలో ధృవీకరించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వేను అత్యంత పకడ్బందీగా నిర్వహించి ప్రతి అర్హ ఓటరిని జాబితాలో చేర్చాలని సూచించారు.
డ్రాఫ్ట్ ఓటరు జాబితా సిద్ధం చేసే ముందు ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ఒక కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండేలా చూడాలని, 1200 మంది ఓటర్లకు మించి ఉంటే కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
ప్రతి బీఎల్‌వోకు ఎస్‌ఐఆర్ నిబంధనలు, ఫీల్డ్ వెరిఫికేషన్ విధానం, ఫారాల నిర్వహణపై పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. డ్రాఫ్ట్ జాబితా విడుదల అనంతరం వచ్చే అభ్యంతరాలు, క్లెయిమ్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రక్రియలో పూర్తిస్థాయి నిష్పాక్షికత పాటించాలని, రాజకీయ పార్టీలతో సమన్వయం కొనసాగిస్తూ సమాన దూరంలో ఉండాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా వీఐపీ, వీవీఐపీ ఓటర్ల పేర్లు మిస్ కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.
జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తామని, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు బి. గంగయ్య, సురేష్, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

