సవాయి గూడంలో 4 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు

Sakshitha news

సవాయి గూడంలో 4 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పనుల పరిశీలన – వనపర్తిలో సీఎంటీసీ, జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం

సాక్షిత వనపర్తి :
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వనపర్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు.

ముందుగా వనపర్తి మండలం సవాయి గూడం గ్రామంలో వనపర్తి మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న 4 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ ఏర్పాటు పనులను ఎమ్మెల్యే సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టు మహిళల ఆర్థిక సాధికారతకు దోహదపడుతుందని ఆయన తెలిపారు. పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమం లో ఎమ్మెల్యే తో పాటు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, డి ఆర్ డి ఓ ఉమాదేవి పాల్గొన్నారు.

అనంతరం వనపర్తి మండలంలో కమ్యూనిటీ మేనేజ్డ్ ట్రైనింగ్ సెంటర్ (CMTC) మరియు జెండర్ రిసోర్స్ సెంటర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందించిన ఆధునిక వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ద్వారా సంబంధిత సిబ్బందితో సమావేశమై కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. సీఎంటీసీ ద్వారా మహిళా సంఘాల సభ్యులకు శిక్షణలు, జీవనోపాధి అవకాశాలు మరియు సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న వివిధ రకాల హింసలు, చట్టపరమైన హక్కులు, మహిళా రక్షణ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల భద్రత, గౌరవం మరియు సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.

తదుపరి నిర్వహించిన బహిరంగ సభలో మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం, స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారత మరియు సామాజిక అభివృద్ధి కోసం పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. మహిళలు సంఘటితంగా ముందుకు వచ్చి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎస్‌ఎల్‌ఎన్ మాధవి, డీఆర్‌డీఓ పి. ఉమాదేవి, అదనపు డీఆర్‌డీఓ వై. సరోజ, స్థానిక ప్రజాప్రతినిధులు, SERP అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ సంస్థల ప్రతినిధులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top