అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదల
జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభం – 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి….
–కలెక్టర్ కోయ శ్రీహర్ష…
….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
పెద్దపల్లి జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని చేపట్టి, అక్టోబర్ 1, 2026న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
ఓటర్ల జాబితాను పారదర్శకంగా, పకడ్బందీగా రూపొందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్న కలెక్టర్, నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ప్రక్రియను నిరంతరాయంగా నిర్వహిస్తామని వెల్లడించారు. 2026 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హ పౌరుడికి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.
జూన్ 15 నుంచి 24 వరకు ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, అవసరమైన ఫారాల ముద్రణ చేపడతామని చెప్పారు. అనంతరం జూన్ 25 నుంచి జూలై 24 వరకు జిల్లా వ్యాప్తంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటి సర్వే నిర్వహించి కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, మరణించిన లేదా వలస వెళ్లిన ఓటర్ల పేర్ల తొలగింపు ప్రక్రియ చేపడతారని వివరించారు.
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను జూలై 24 నాటికి పూర్తి చేసి, జూలై 31న సవరించిన ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణకు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అవకాశం ఉంటుందని చెప్పారు.
అందిన అభ్యంతరాలు, క్లెయిమ్‌లను సెప్టెంబర్ 28లోగా పూర్తిగా పరిష్కరించి, అన్ని ప్రక్రియలు ముగిసిన అనంతరం అక్టోబర్ 1, 2026న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, తహశీల్దార్లు షెడ్యూల్‌ను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించిన ఆయన, కొత్త ఐటీ విధానాలపై బీఎల్ఓలు, సూపర్వైజర్లకు తగిన శిక్షణ అందించాలని సూచించారు.
అర్హులైన ప్రతి పౌరుడు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటరు జాబితాలో తమ పేర్లు సరిచూసుకోవాలని, కొత్తగా అర్హత పొందిన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
