వైభవంగా బ్రహ్మోత్సవ ధ్వజారోహణం
** నారాయణవనం అగస్తీశ్వర ఆలయంలో….
సాక్షిత ప్రతినిధి – తిరుపతి / పుత్తూరు: పుత్తూరుకు 3 కి.మీల దూరంలోని నారాయణవనం శ్రీ మరగదవల్లీ సమేత శ్రీ అగస్తీశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఉదయం 7.30 నుంచి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
వాహన సేవల వివరాలు:
22న (నేడు) – సింహ వాహనం
23 – హంస వాహనం
24 – శేష వాహనం
25 – నంది వాహనం
26 – గజ వాహనం
27న రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.
కాగా 28న రాత్రి 7 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించి, అనంతరం అశ్వవాహన సేవ ఉంటుంది. రూ.500 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం అందజేస్తారు.
29న ఉదయం 9 గంటలకు శ్రీ నటరాజస్వామివారి వీధి ఉత్సవం జరుగనుంది. సాయంత్రం రావణాసుర వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. 30న కైలాసకోనలో త్రిశూల స్నానం ఘనంగా నిర్వహించి, అదేరోజు రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ప్రతిరోజు ఉదయం 10 నుండి 11 గంటల మధ్య ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, రాత్రి 7.30 గంటలకు వాహనసేవ నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు కోలాటం, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఆలయ చరిత్ర
నారాయణవనం ప్రాంతాన్ని పరిపాలించిన శ్రీ పద్మావతీదేవి తండ్రి అయిన శ్రీ ఆకాశ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ శ్రీ అగస్తీశ్వరస్వామివారు స్వయంభువుగా వెలిశారు. అనంతరం శ్రీ అగస్త్య మహర్షులు వేద ఆగమ శాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడంతో స్వామివారికి “అగస్తీశ్వరస్వామి” అనే పేరు వచ్చింది.

