నూతన సదుపాయాలతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి…

Sakshitha news

నూతన సదుపాయాలతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి…

చిన్న ఆసుపత్రి నుంచి భారీ అభివృద్ధి…

క్రిటికల్ కేర్ భవనాన్ని ఎమ్మెల్యే తో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్..

సాక్షిత పెద్దపల్లి// రామగుండం:
నూతన సదుపాయాలతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.

రామగుండం నగరంలోని గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలో రూ.23 కోట్ల 75 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ భవనాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ఆధునిక వైద్య సదుపాయాలతో నిర్మించిన ఈ క్రిటికల్ కేర్ భవనం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో రోగులకు మెరుగైన చికిత్స అందించగలమని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ భవనం ద్వారా ప్రాంతీయ ప్రజలకు విశేష ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

నూతనంగా ఏర్పాటు చేసిన ఈ క్రిటికల్ కేర్ సెంటర్, అందుబాటులోకి వచ్చిన సదుపాయాలు గోదావరిఖని జనరల్ ఆసుపత్రి సిబ్బందిపై మరింత బాధ్యతను పెంచుతున్నాయని పేర్కొన్నారు. ఈ అంచనాలకు అనుగుణంగా సిబ్బంది పని చేసి రోగులకు మెరుగైన సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ క్రిటికల్ కేర్ భవనం ప్రారంభంతో ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చిన్న ఆసుపత్రి మాత్రమే ఉండేదని, అది అప్పటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో ప్రారంభించబడిందని గుర్తుచేశారు. సింగరేణి, జెన్‌కో, ఎన్‌టిపిసి వంటి సంస్థలు తమ తమ ఉద్యోగులకు మాత్రమే వైద్య సేవలు అందించేవని పేర్కొన్నారు.

ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని తెలిపారు. ప్రజల ఉద్యమం ఫలితంగా గత ప్రభుత్వం మెడికల్ కాలేజీకి అనుమతి ఇచ్చినా, తగిన నిధులు పూర్తిగా అందలేదని అన్నారు.

జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ, కృషితో మెడికల్ కాలేజీకి అవసరమైన సదుపాయాలు కల్పించి ఆసుపత్రిని అభివృద్ధి చేశారని ప్రశంసించారు. గతంలో రోజుకు సుమారు 200 మంది మాత్రమే ఓపి సేవలు పొందేవారని, ప్రస్తుతం అది రోజుకు 1500 మందికి పెరిగిందని తెలిపారు.

గోదావరిఖని ఆసుపత్రి పునరుద్ధరణ, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు, సదరం శిబిరాల నిర్వహణ, అంతర్గత రహదారుల శుభ్రత, ఆసుపత్రి పరిసరాల అభివృద్ధి వంటి చర్యలతో మెరుగైన వాతావరణాన్ని కల్పించినందుకు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇంకా 350 పడకల సామర్థ్యంతో మరో ఆసుపత్రి నిర్మాణంలో ఉందని, మొత్తం పడకల సామర్థ్యం 650కి పెరుగుతుందని పేర్కొన్నారు.

రామగుండాన్ని ఆరోగ్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రస్తుతం రామగుండం మెడికల్ కాలేజీలో పీజీ కోర్సులు కూడా ప్రారంభమై, సదుపాయాల పెంపుతో ప్రతి సంవత్సరం పీజీ సీట్ల సంఖ్య పెరుగుతోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, డాక్టర్లు హిమబిందు, దయాళ్ సింగ్,అరుణ,సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top