రూ.100 కోట్ల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి 8 ఏళ్ల జాప్యం, వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్…
రామగుండంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని కలెక్టర్‌కు స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక వినతి…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి:రామగుండం, పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 2018లోనే సుమారు రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ, ఎనిమిదేళ్లు గడిచినా స్థల సేకరణ, నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంపై రామగుండం స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ సమస్యపై నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఐక్యవేదిక ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. అనంతరం ప్రతినిధులు మద్దెల దినేష్, దుర్గం నగేష్, గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ, ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం తీవ్ర జాప్యానికి గురైందని విమర్శించారు.
అసంఘటిత రంగ కార్మికులతో పాటు లక్షలాది మంది కార్మికులు నాణ్యమైన వైద్య సేవలకు దూరమవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి బొగ్గు, విద్యుత్, ఎరువుల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న రామగుండం వంటి పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పటికీ పూర్తి స్థాయి ఈఎస్ఐ ఆస్పత్రి అందుబాటులోకి రాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా, రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని ఆమోదించినా జిల్లా స్థాయిలో జాప్యం కారణంగా ఆస్పత్రి నిర్మాణం ముందుకు సాగడం లేదని వారు ఆరోపించారు. పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి కార్మికుల ఆరోగ్య భద్రత అత్యంత కీలకమని, 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు ద్వారా వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
రామగుండంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించి, పెండింగ్‌లో ఉన్న స్థల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో కంది సుజాత, కొండు రమాదేవి, వై. లెనిన్, కె. రవి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
