420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం.. చింతల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా…
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పిలుపు మేరకు, బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తవుతున్నా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని MLA కేపీ. వివేకానంద తీవ్రంగా విమర్శించారు.
రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, పేదలు తదితర వర్గాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేయడం తగదని అన్నారు.
పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలి.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించాలి.. ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి అంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల తరఫున పోరాడుతుందని MLA స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, మహిళలు, యువత, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST