26062 మంది రైతులకు “అన్నదాత సుఖీభవ”

Sakshitha news

26062 మంది రైతులకు “అన్నదాత సుఖీభవ”

** చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వెల్లడి

సాక్షిత ప్రతినిధి – చంద్రగిరి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మస్థలం ఉండే నియోజకవర్గమైన చంద్రగిరిలో “అన్నదాత సుఖీభవ” పథకం 26062 మంది రైతులకు లబ్ధి చేకూరిందని ఎమ్మెల్యే పులివర్తి నాని వెల్లడించారు. ప్రభుత్వం ప్రారంభించిన “అన్నదాత సుఖీభవ” పథకాన్ని ఎమ్మెల్యే నాని మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ పాలకుల వల్ల రాష్ట్రం అధోగతిపాలై అప్పుల ఊబిలో కూరుకు పోయిందన్నారు. అయినప్పటికీ మన ముఖ్యమంత్రి రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే కాబట్టి ఆయనకు రైతుల కష్టాలు, కన్నీళ్లు తెలుసునని చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 17.85 కోట్ల రూపాయల లబ్ది చేకూరిందన్నారు. పార్టీలకు అతీతంగా… అర్హులైన ప్రతి ఒక్కరికి “అన్నదాత సుఖీభవ” పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెల్లిందన్నారు.
కూటమి ప్రభుత్వ పాలకులకు రైతుల కష్టాలు , కన్నీళ్లు తెలుసునని, రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం అన్నారు.


ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని తెలిపారు. సాదారణ రైతు కుటుంబం నుంచి బయటకు వచ్చి రాజకీయంలో తనదైన శైలిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రైతుల కష్టాలు తెలుసని చెప్పారు. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్న తన విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. అంతేగాక వ్యవసాయ శాఖ మంత్రిని దామలచెరువుకు పంపి ప్రణాళికా బద్ధంగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసి రైతుల నుంచి మామిడి కొనుగోలు చేసి ప్రతి రైతుకు గుజ్జు పరిశ్రమ, మండీ వ్యాపారుల నుండి రైతులకు లబ్ది చేకూర్చామని తెలిపారు. ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి అనేందుకు ఇప్పటికే రైతుల కోసం సబ్సిడీ ద్వారా పని ముట్లు, యూరియా, ట్రాక్టర్లు, వేరుశనగ విత్తనాలు, ఇతర పంటలు పండించే రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందనీ తెలిపారు.

మండలాల వారీగా వివరాలు :
చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా మండలాల వారిగా లబ్ధి పొందిన రైతుల వివరాలను వెల్లడించారు. చంద్రగిరి మండలంలో 4,504 మంది రైతులకు 2.94 కోట్లు రూపాయలు, చిన్నగొట్టిగల్లు మండలంలో 4,359 మంది రైతులకు 3.07 కోట్లు రూపాయలు, తిరుపతి రూరల్ మండలంలో 2,919 మంది రైతులకు 1.94 కోట్లు రూపాయలు, పాకాల మండలంలో 5,029 మంది రైతులకు 3.52 కోట్లు, యర్రావారిపాలెం మండలంలో 4,944 మంది రైతులకు 3.43 కోట్లు రూపాయలు,రామచంద్రా పురం మండలంలో 4,307 మంది రైతులకు 2.95 కోట్లు రూపాయలను కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు.