100% అర్థమయ్యే బోధనతోనే విద్యార్థుల భవిష్యత్ బలంగా….
పోటీ ప్రపంచానికి సిద్ధం చేసే బాధ్యత ఉపాధ్యాయులపై, రోజుకు గంట చదువు తల్లిదండ్రుల బాధ్యత….
– కలెక్టర్ కోయ శ్రీ హర్ష….
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్-టీచర్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి 100 శాతం అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయులు బోధన చేయాలని సూచించారు. విద్యార్థులను దేశ, రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో ముందుండేలా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్న కలెక్టర్, పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత కనీసం రోజుకు ఒక గంట చదివేలా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. చదవడం, రాయడం విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
రాష్ట్ర స్థాయిలో పాఠశాలకు అవార్డు లభించిన నేపథ్యంలో ఉపాధ్యాయులపై బాధ్యతలు మరింత పెరిగాయని, అదే ఉత్సాహంతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి అభివృద్ధి పరచాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని, అందరూ కలిసి కృషి చేస్తే పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గుడిపల్లి శ్రీనివాస్ రూ.20,000 విలువైన సౌండ్ సిస్టమ్‌ను పాఠశాలకు ఉచితంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిఇఓ శారద, కవిత, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY