వైఎస్ఆర్ పాలనను ప్రతిపక్షాలు సైతం మెచ్చుకున్నాయి….
ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞంతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్ఆర్….
— ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్ఎస్యూఐ నాయకుడు మెంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలన ప్రజా సంక్షేమం, రైతుల అభ్యున్నతి, పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సాగిందన్నారు. ఆయన పరిపాలన ప్రజల మన్ననలు పొందడంతో పాటు ప్రతిపక్ష నాయకులు సైతం ప్రశంసించే స్థాయిలో సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తుచేశారు.
పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ పథకం, పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే అవకాశం కల్పించిన ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల పొలాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన జలయజ్ఞం వంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ దూరదృష్టికి నిదర్శనమని అన్నారు. పేదలు, రైతులు, విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా వైఎస్ఆర్ పాలన సాగిందని పేర్కొన్నారు.
వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆయన తీసుకున్న ప్రజానుకూల నిర్ణయాలు నేటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు.
రామగుండంలో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలి
రామగుండం పట్టణంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనువైన ఖాళీ స్థలాన్ని చూపించాలని నగర మేయర్ మహంకాళి స్వామిని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. వైఎస్ఆర్ జ్ఞాపకార్థం రామగుండంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, ఎన్ఎస్యూఐ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST