నీట్–పీజీ పరీక్షా కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు…
పరీక్షా కేంద్రాలను పరిశీలించిన, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా…
సాక్షిత న్యూస్ పెద్దపల్లి, ఆగస్టు 30: పెద్దపల్లి పట్టణంలో ఆదివారం నిర్వహించిన నీట్–పీజీ 2026 పరీక్షల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి డీసీపీతో కలిసి బండారికుంట సమీపంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా పరీక్షా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య, భద్రతా చర్యలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు పూర్తయిన అనంతరం ప్రశ్నపత్రాలు, ఇతర పరీక్షా సామగ్రిని సురక్షితంగా తరలించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు.
పెద్దపల్లి జోన్ పరిధిలో మొత్తం మూడు పరీక్షా కేంద్రాల్లో నీట్–పీజీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. పెద్దకల్వలలోని మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల, పెద్దపల్లిలోని బండారికుంట సమీపంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల, రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ట్రాఫిక్ నియంత్రణతో పాటు పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ముగిసిన తర్వాత ప్రశ్నపత్రాలు, ఇతర పరీక్షా సామగ్రిని సురక్షితంగా గమ్యస్థానాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని, అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని పోలీస్ కమిషనర్ కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
