సిండికేట్ “మత్తు” లో ఆబ్కారీ శాఖ…

Sakshitha news

సిండికేట్ “మత్తు” లో ఆబ్కారీ శాఖ…

అశ్వారావుపేట లో మద్యం సిండికేట్లు రాజ్యమేలుతున్నారు?

అశ్వారావుపేట సాక్షిత :
అశ్వారావుపేట లో మద్యం సిండికేట్లు రాజ్యమేలుతున్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే సిండికేట్లకు తొత్తులుగా మారిపోవడం ఇప్పుడు సర్వత్ర చర్చనీయంగా మారింది. గ్రామాల్లో బెల్ట్ షాపులు పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నాయి. నిర్ణీత ధరలు కంటే (ఎంఆర్పి) కి ఎక్కువగా విక్రయిస్తున్న అధికారులు మాత్రం కళ్ళు మూసుకొని కూర్చున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని ప్రతి పట్టణం ప్రతి పల్లె లో మద్యం ఏరులై పారుతుంది అది ప్రభుత్వ ఆదాయం కోసం కాదు సిండికేట్ల జేబులు నింపడానికి .! అక్రమ అమ్మకాలను అరికట్టాల్సిన అధికారులే సిండికేట్లకు కాపలాదారులుగా మారడం ఇప్పుడు సర్వత్ర చర్చ నీ అంశంగా మారుతుంది.

మామూళ్ల మత్తులో యంత్రాంగం…

ప్రజల ఆరోగ్యం శాంతిభద్రతల కంటే తమకు వంచే ‘కవర్ల’ కే ఎక్సైజ్ అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిండికేట్లు నిర్ణయించిన ధరలకే మద్యం అమ్మలని నిబంధనలు పెడుతున్న కనీసం తనిఖీలు చేయడానికి కూడా అధికారులు సాహసించడం లేదు క్షేత్రస్థాయిలో అక్రమాలను అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఏసీ గదులకే పరిమితమై సిండికేట్ ప్రతినిధులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారు అనేది నగ్నసత్యం.

జనంలో వెల్లువెత్తుతున్న ఆగ్రహం

మరోవైపు ఈ అక్రమ దందాల వల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి.
“ప్రభుత్వ నిబంధనలు కేవలం పేపర్లకే పరిమితమా?
అధికారుల అండలేనిదే ఈ అక్రమాలు సాధ్యమేనా?”అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మహిళా లోకం ఈ పరిస్థితి పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. ఆబ్కారీ శాఖ పనితీరుపై నమ్మకం కోల్పోతున్నామని తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకోకపోతే ప్రజా ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

మామూళ్ల కోసమే మీ కొలువులా…?

ఆబ్కారీ శాఖలో “సిండికేట్” రాజ్యమేలుతుంది. మండలాల్లో అధికారుల కనుసన్నల్లోనే అక్రమ దందాలు జోరుగా సాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు.. మద్యం సిండికేట్ల చేతిలో చట్టం కూడా బంధీ అయిందని పలువురు వాపోతున్నారు. సిండికేట్ల దందాతో అధికారులకు విందులు ఏర్పాటు చేస్తున్నారని అందుకే ఎవరు నోరు మెదపడం లేదని సామాన్యుడు జేబుకు చిల్లు ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంచాలకు అలవాటు పడిన అధికారులు మధ్యవర్తులుగా మారుతున్నారని కింగ్ మేకర్లుగా సిండికేట్లు వారికి అందిన కాడికి దోచుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. అధికారుల వ్యవహార శైలి నిర్లక్ష్యం వీధుల్లో అలసత్వం బాధ్యతారహిత్యాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్న పట్టించుకోకుండా ఇవన్నీ మాకు మామూలే అని మామూళ్ల మత్తులో తేలి ఆడుతున్నారు.

మామూళ్ల మత్తులో మౌనం

ఆబ్కారీ శాఖ అధికారులు మద్యం సిండికేట్ లకు మధ్య ఉన్న “అనుబంధం”పెనవేసుకుపోయింది. ప్రతి నెల కచ్చితమైన సమయానికి అధికారుల చేతుల్లోకి “పచ్చ నోట్ల కట్టలు”అందుతుండడంతో వారు అక్రమాల వైపు కన్నెత్తి చూడటం లేదు. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారుల వరకు ఈ వాటాల పంపిణీ యదేచ్చగా సాగుతుందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మేము మా కుటుంబాలు పచ్చగా ఉంటే చాలు పచ్చ నోట్ల కు అలవాటు పడిన అధికారులు బెల్ట్ షాపు అమ్మకాలపై నోరు కళ్ళు మూసుకొని యువత నిరుద్యోగులు ఉద్యోగులు జీవితాలను ఆరోగ్యాలను నాశనం చేస్తూ చోద్యం చూస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

నిబంధనలు గాలికి… సిండికేట్ లదే హవా!

నిబంధనల ప్రకారం వైన్ షాపులు నిన్నేత సమయానికి తెరవాలి ఎమ్మార్పీ ధరలకే అమ్మాలి కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది ప్రతి బాటిల్ పై 20 నుంచి 80 వరకు అదనంగా వసూలు చేస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నేరెత్తునట్టు ప్రవర్తిస్తున్నారు. పల్లె పల్లెకు మద్యం పాకినా బెల్ట్ షాపులు అధికారుల అండ దండలతోనే నడిపిస్తున్నారు. అనుమతి లేని ఈచోట్ల విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్న ఎక్సైజ్ శాఖ చూసి చూడనట్లు ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి వేళల్లో షట్టర్లు దించిన దొడ్డి దారిన విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

కొరవడిన నిఘా ? కరువైన నియంత్రణ.?

మద్యం విక్రయాల్లో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తనిఖీల పేరిట అధికారులు చేసే హడావిడి కేవలం కంటి తుడుపు చర్యగానే కనిపిస్తుంది. తనిఖీలకు వెళ్లే ముందే సమాచారం చేరవేయడం ఏదో ఒక చిన్న షాపు ని పట్టుకోవడం దానికి చిన్న ఫైన్ వేసి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. సామాన్యుడి ప్రాణాలతో చెలగాటమాడుతున్న మద్యం అక్రమ విక్రయాలను

అడ్డుకోవాల్సిన బాధ్యత మీది కాదా? సిండికేట్ల ప్రయోజనాలే మీకు ముఖ్యమా?
అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా అధికారులు సిండికేట్లకు వత్తాసు పలకడం మాని ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చూడాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్ట్ షాప్ నిర్వాహకులు మధ్యలో సోడా నీళ్లు లాగా కలిసిపోయి మద్యం ప్రియులను పకోడీలుగా పంచుకు తింటూ ఎంజాయ్ చేస్తూ తమ జేబులను నింపుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఉన్నత అధికారులు బెల్ట్ షాపులపై జిల్లా ఎక్సైజ్ అధికారుల పనితీరుపై పర్యవేక్షించి కఠిన చర్యలను తీసుకోవాలని ప్రజలు మహిళలు డిమాండ్ చేస్తున్నారు.